చరిత్ర కను‘మరుగు’
చిట్యాల: చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులోని రామలింగేశ్వరస్వామి ఆలయం ఎదుట పురాతన కోనేరు(మెట్ల బావి) ఉంది. 1100 ఏళ్ల క్రితం కాకతీయ రాజుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగిందని, కాకతీయుల పట్టపురాణి రాణి ముప్ప మహాదేవి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించి జాతరను ప్రారంభించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణ సమయంలోనే గుట్ట కింద కోనేరు నిర్మించారు. కోనేరు చుట్టూ రాత్రితో గుండ్రటి గుమ్మటాల ఆకారంలో గదులు, కోనేరులోకి దిగేందుకుగాను వీలుగా మెట్లు నిర్మించారు. కొన్నేళ్ల క్రితం వరకు ఈ కోనేరు పూర్తిగా కంపచెట్లతో నిండిపోయి ఉండగా.. గ్రామస్తులు కోనేరులో పెరిగిన పిచ్చి చెట్లను తొలగించడంతో ఇటీవల కురిసిన వర్షాలకు అందులోకి నీరు వచ్చి చేరింది. కోనేరు పక్కన నిర్మాణాలు కొంతమేర ధ్వంసం కాగా మరికొన్ని నిర్మాణాలు నేటికీ కనిపిస్తున్నాయి. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఈ కోనేరు పునరుద్ధరణకు నిధులు మంజూరు చేసి వినియోగంలోకి తీసుకొస్తే పురాతన కట్టడాన్ని పరిరక్షించి వారసత్వ సంపదను ముందు తరాలకు అందించినట్లవుతుంది.


