యాదగిరీశుడికి అలంకారోత్సవం
యాదగిరిగుట్ట: పంచనారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదగిరీశుడికి అలంకారోత్సవాలు, వాహన సేవలకు అర్చకులు ఆగమ శాస్త్రం ప్రకారం శుక్రవారం శ్రీకారం చుట్టారు. మత్య్సవతారుడిగా అలంకృతుడై.. శేష వాహనంపై ఆలయ తిరు మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి వారికి ఉదయం నిత్యారాధనలు పూర్తెన తరువాత పారాయణీకులు వేద పారాయణం పఠించారు. అలంకరించిన మత్స్యావతార అలంకార సేవకు ప్రత్యేక పూజలు చేసి, హారతిని నివేదించారు. అనంతరం ఉత్తర ద్వారం నుంచి మాడ వీధుల్లో ఊరేగుతూ, తూర్పు మాడ వీధిలో మత్స్య అలంకారసేవను అర్చకులు అధిష్టింపచేశారు. వేడుకల్లో ఆలయ ఈఓ భవాని శంకర్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రచార్యులు ఆచార్యులు పాల్గొన్నారు.
ఆలయంలో సాయంత్రం...
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం అర్చకులు నిత్యారాధనలు నిర్వహించారు. రాత్రి వేళ శ్రీస్వామి వారిని శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అలంకార సేవను తూర్పు మాడ వీధిలో అధిష్టింపజేసి వేద మంత్రాలు, పారాయణాలు పఠించారు. వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం, రాత్రి అలంకార సేవలను ఊరేగిస్తారు. ఉదయం 9 గంటలకు వటపత్రశాయి అలంకారసేవ, రాత్రి7 గంటలకు హంస వాహన అలంకార సేవ నిర్వహించనున్నారు.
ఫ విశేష పర్వాలకు
శ్రీకారం చుట్టిన అర్చకులు
ఫ మత్స్యావతారుడిగా శేష వాహనంపై విహరించిన స్వామివారు


