శ్రీశైలానికి ఐదో ట్రిప్పు
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీజీటీడీసీ) నిర్వహిస్తున్న లాంచీ సేవలు కొనసాగుతున్నాయి. నవంబర్ 28న సాగర్–శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని టూరిజం శాఖ ప్రారంభించింది. శనివారం ఐదో ట్రిప్పులో 120 మందితో లాంచీ శ్రీశైలానికి బయల్దేరింది. ఈ ప్రయాణానికి పర్యాటకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఐదో ట్రిప్పులో సీనియర్ జర్నలిస్టు, సాక్షి దినపత్రిక మాజీ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించారు. సాగర్ ప్రాజెక్టులోని నీటిమట్టం ఆధారంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో లాంచీ ట్రిప్ కొనసాగించే అవకాశం ఉన్నట్లు టూరిజం అధికారులు వెల్లడించారు.


