కృష్ణపట్టెలో మొసళ్ల భయం
అడవిదేవులపల్లి : కృష్ణపట్టెలో మొసళ్లు, కొండచిలువలు, పాములు సంచరిస్తుండటంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. రెండేళ్ల వ్యవధిలో పదుల సంఖ్యలో మొసళ్లు జనావాసాల్లో పట్టుబడ్డాయి. పదుల సంఖ్యల్లో కొండచిలువలు, పాములు గ్రామస్తుల చేతిలో హతమయ్యాయి. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి అడవిదేవులపల్లిలోని టెయిల్‌పాండ్ వరకు 21 కిలోమీటర్ల వరకు నీరు నిల్వ ఉంటుంది. అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టు నుంచి టెయిల్‌పాండ్ వరకు కూడా నీరు నిల్వ ఉంటుండడంతో మొసళ్లకు ఆవాసంగా మారింది. దీంతో ఆహారం కోసం కృష్ణపట్టెలోని సమీప గ్రామాల్లోకి రాత్రివేళ మొసళ్లు వస్తుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పగటి వేళ సైతం ఒంటరిగా వెళ్లేందుకు భయపడుతున్నారు. అడవిదేవులపల్లి మండలంలోని నడిగడ్డ, చిట్యాల గ్రామాల్లో ఈ మొసళ్ల సమస్య అధికంగా ఉంది. ఇటీవల కాలంలో నడిగడ్డ గ్రామంలోకి మొసళ్లు రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా చిట్యాల గ్రామంలో నది వద్ద నీరు తాగుతున్న మేకపోతును మొసలి తినేసింది. కాగా నది తీరంలో మనుషులు, పశువులు, మూగజీవాలు నీరు తాగే ప్రాంతాల్లోనే మొసళ్లు మాటు వేస్తున్నాయి. కృష్ణాతీరంలోని అడవిదేవులపల్లి, నడిగడ్డ, చిట్యాల, ముదిమాణిక్యం, ఇర్కిగూడెంతో పాటు వాడపల్లి, మఠంపల్లి పుణ్యక్షేత్రాల వద్ద నదిలోకి దిగి స్నానాలు చేసేటప్పుడు భక్తులు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
గ్రామాల్లోకి వస్తున్న
జలచరాలు, పాములు
రాత్రివేళ బయటకు వెళ్లాలంటనే
జంకుతున్న ప్రజలు
అధికారులు రక్షణ చర్యలు
చేపట్టాలని వేడుకోలు
మొసళ్ల బారి నుంచి కాపాడాలి
గ్రామాల్లోకి నిత్యంమొసళ్లు, పాములు వస్తున్నాయి. టెయిల్‌పాండ్ బ్యాక్ వాటర్ వలన గ్రామానికి ఇరువైపులా నీరు రావడంతో విషపు పురుగుల బెడద ఎక్కువైంది. అధికారులు స్పందించి మొసళ్ల బారి నుంచి కాపాడాలి. గ్రామం చుట్టూ రక్షణ కవచంలా కంచె ఏర్పాటు చేయాలి.
– రామానుంజనేయులు,
చిట్యాల గ్రామం, అడవిదేవులపల్లి
కృష్ణపట్టెలో మొసళ్ల భయం


