రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మాడుగులపల్లి : మాడుగులపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లికి చెందిన కొండ నాగరాజు(35), మిర్యాలగూడకు చెందిన నరేందర్ తమ ద్విచక్ర వాహనాలపై మాడుగులపల్లి మండల కేంద్రంలో యూటర్న్ తీసుకుంటుండడగా.. వెనుక నుంచి వచ్చిన అశోక్ లేలాండ్ దోస్త్ వాహనం నాగరాజు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఆ ద్విచక్ర వాహనం నరేందర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగరాజు, నరేందర్‌కు తీవ్ర గాయాలు కాగా.. వారిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నాగరాజు మృతిచెందాడు. నరేందర్ నల్లగొండలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి భార్య కొండ రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కళాత్మకంగా ఇక్కత్ వస్త్రాలు
● నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మెంబర్
జస్టిస్ పుష్పసత్యనారాయణ
భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో కళాత్మకంగా ఉన్నాయని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మెంబర్ జస్టిస్ పుష్పసత్యనారాయణ అన్నారు. శనివారం ఆమె పోచంపల్లిని సందర్శించారు. స్థానిక చేనేత సహకార సంఘంలో ఇక్కత్ చేనేత వస్త్రాలు, డిజైన్లను పరిశీలించారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతీయంగా ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకొని ఇక్కడి కళాకారుల నైపుణ్యాన్ని అభినందించారు. అనంతరం ఆమె చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు.
యాదగిరీశుడి సేవలో ప్రముఖులు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని తమిళనాడు హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం. దండపాణి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ మెంబర్ జస్టిస్ పుష్ప సత్యనారాయణ, ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, కుటుంబ సభ్యులు శనివారం వేర్వేరుగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం


