మూడేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
దేవరకొండ : రాబోయే మూడేళ్లలో జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లను స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ అధ్యక్షతన శనివారం దేవరకొండలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా ఎన్నికై న సర్పంచులు ప్రజలందరి సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయిస్తుందని పేర్కొన్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్ధులను అత్యధిక సంఖ్యలో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నక్కలగండి ప్రాజెక్టును పూర్తిచేస్తామని హామీ ఇచ్చి తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీపై నోరు పారేసుకుంటున్న బీఆర్‌ఎస్ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాశ్‌నేత మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్పంచులు పంచాయతీల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. రాష్ట్రంలోనే దేవరకొండ నియోజకవర్గంలో అత్యధికంగా 180 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారని గుర్తుచేశారు. రాబోయే మూడేళ్లల్లో ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేసి సాగునీరు అందిస్తామన్నారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. అనంతరం కాంగ్రెస్ సర్పంచులు, ఉప సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమునమాధవరెడ్డి, శ్రీలతారెడ్డి, దొంతం సంజీవరెడ్డి, వేణుధర్‌రెడ్డి, వెంకటయ్యగౌడ్, జాల నర్సింహారెడ్డి, ఆలంపల్లి నర్సింహ, ఏవీరెడ్డి, రాజేష్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రేఖారెడ్డి, వేమన్‌రెడ్డి, పార్వతి, గుంజ రేణుక, ప్రతాప్‌రెడ్డి, కిన్నెర హరికృష్ణ, కొర్ర రాంసింగ్, ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.
నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి


