విద్యుదాఘాతంతో మహిళ మృతి
కనగల్ : పొలంలో వరి నాట్ల పనులను పరిశీలిస్తుండగా.. ప్రమాదవశాత్తు కరెంట్ వైరు తగిలి విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందింది. ఈ ఘటన కనగల్ మండలం ఏమిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని దేపవారిగూడెం గ్రామంలో శనివారం జరిగింది. ఎస్‌ఐ రాజీవ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేపవారిగూడేనికి చెందిన దేప వనమ్మ(58) తన వ్యవసాయ భూమిలో వరి నాట్ల పనులను పరిశీలించడానికి పొలానికి వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు పొలంలో ఉన్న కరెంట్ తీగ ఆమెకు తగలడంతో విద్యుదాఘాతానికి గురైంది. అక్కడే ఉన్న ఆమె కొడుకు మహేందర్‌రెడ్డి వెంటనే తల్లి వద్దకు పరుగు తీసి కర్ర సాయంతో వైరును తొలగించి ఆమెను పొలం నుంచి బయటకు తీసుకొచ్చాడు. అప్పటికే వనమ్మ మృతిచెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
స్కూటీ అదుపుతప్పి..
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండలం అవంతీపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్లకు చెందిన సట్టు మనోజ్ (26) తన స్నేహితులు రమావత్ రాకేష్, భూక్య సాయిశివ, గుడిసె సురేష్ కలిపి శుక్రవారం రాత్రి మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి వెంట ఉన్న కృష్ణపట్నం హోటల్‌లో భోజనం చేసి తిరిగి నేరేడుచర్లకు ప్రయాణమయ్యారు. గుడిసె సురేష్, సట్లు మనోజ్ స్కూటీపై వేగంగా వెళ్తుండగా.. అవంతీపురం వద్ద జడ్జర్ల–కోదాడ జాతీయ రహదారిపై స్కూటీ అదుపుతప్పడంతో మనోజ్ కిందపడిపోయాడు. అతడి తల, చేతులకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


