30 ఏళ్ల ఆదాయం
వక్కసారి నాటితే..
గుర్రంపోడు : వ్యవసాయ రంగంలో కొంతమంది రైతులు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ సుస్థిర ఆదాయం వైపు అడుగులు వేస్తున్నారు. జిల్లా నేలలు వక్కసాగుకు అనుకూలం కావడంతో రైతులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ముప్‌పై ఏళ్ల పాటు స్థిరమైన దిగుబడులు ఇచ్చే వక్కసాగుతో యేటా ఎకరాకు కనీసం రూ.2లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. గుర్రంపోడు మండలంలోని మొసంగి, కాచారం, పిట్టలగూడెం గ్రామాలతోపాటు పెద్దవూరు మండలంలోనూ వక్క సాగు చేస్తున్నారు. కేరళ, తమిళనాడుల్లో సాగవుతున్న వక్క తోటలతోపాటు, అనంతపురం, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సాగవుతున్న వక్క తోటలను సందర్శించి కొంతమంది ఈ ప్రాంతంలో వక్కసాగు చేస్తున్నారు. అక్కడి రైతుల అనుభవాలను బట్టి ఏటా ఎకరాకు రూ.ఐదు లక్షల వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నా.. ఖాయంగా రూ.రెండు లక్షలకు తగ్గదన్న భరోసాతో సాగు చేపడుతున్నారు.
అంతరపంటగా..
40 ఫీట్ల ఎత్తు వరకు పెరిగే వక్క మొక్కలను ఆయిల్‌పామ్, కొబ్బరి, ఎర్రచందనం తదితర పంటల్లో అంతరపంటగా ఈ మొక్కలు సాగు చేస్తున్నారు. వక్క కాయలతోపాటు వక్క మట్టలు కూడా ఇస్తార్లుగా ఆదాయం సమకూర్చుతాయి. ఎకరాకు 8 ఫీట్ల దూరంతో 400 మొక్కల వరకు సాగుచేసుకోవచ్చు. వక్కకు మార్కెటింగ్ సమస్య కూడా లేదు. నేరుగా పతంజలి లాంటి కంపెనీలు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తాయి. నాటిన నాలుగేళ్ల నుంచి కాపు మొదలై ఏడేళ్లలో పూర్తి స్థాయిలో దిగుబడులు వస్తాయి. ఎకరాకు రెండు టన్నుల వరకు దిగుబడులు వస్తాయి. కేజీ కాయలు రూ.ఐదు వందల వరకు ధర ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
వినూత్న పంటల సాగుపై రైతుల ఆసక్తి
వక్క తోటతో ఏటా ఎకరాకు కనీసం
రూ.2లక్షల వరకు ఆదాయం
ఇక్కడి నేలలు అనుకూలం కావడంతో అంతర పంటగా సాగు చేస్తున్న రైతులు
30 ఏళ్ల ఆదాయం


