రాజేష్ మృతిపై సమగ్ర విచారణ చేయాలి
కోదాడ: రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ అనుమానాస్పద మృతిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. శుక్రవారం కోదాడలోని గాంధీనగర్‌లో ఉన్న కర్ల రాజేష్ ఇంటికి వెళ్లి అతని తల్లి లలితమ్మను పరామర్శించారు. రాజేష్ మృతికి సంబంధించిన వివరాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.4,12,000 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యుడు శంకర్, జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి, ఆర్డీఓ సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ వాజీద్ అలీ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరిరాజు, కోటేష్, సుందర్‌బాబు పాల్గొన్నారు.
దళిత వర్గాలకు ఎస్సీ, ఎస్టీ కమిషన్
అండగా ఉంటుంది
మునగాల: దళిత వర్గాలకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. మునగాల మండలం నారాయణగూడెంలోని మాలపల్లి కాలనీలో ఇటీవల అగ్రవర్గాల వారు దాడి చేసిన ఘటనలో విచారించేందుకు శుక్రవారం ఆయన గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు.
ఈనెల 30న గ్రామంలో సామూహిక విందు భోజనాలు ఏర్పాటు చేసే విధంగా చూడాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ జిల్లా అధికారిణి దయానందరాణిని కోరారు. ఆయన వెంట కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
బక్కి వెంకటయ్య


