సమగ్ర శిక్షా ఉద్యోగులకు ‘ఎఫ్‌ఆర్‌ఎస్’
భువనగిరి : సమగ్ర శిక్షా ఉద్యోగుల సమయ పాలన, పనిలో పారదర్శకత పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ మరో నిర్ణయం తీసుకుంది. బోధన, బోధనేతర సిబ్బందికి జనవరి 1నుంచి ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ (ఎఫ్‌ఆర్‌ఎస్) అమలు చేయనున్నారు. సమగ్ర శిక్షా అభియాన్ పరిధి లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలను ఈనెల 28 లోపు పంపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాప్ట్ కాపీ, హార్డ్‌కాపీల రూపంలో పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి పంపాలని సూచించింది. ఇప్పటికే పాఠశాలల్లో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేస్తుండగా, తాజాగా సమగ్ర శిక్షా ఉద్యోగులకు సైతం ఫేస్ రికగ్నేషన్ కిందికి తెస్తున్నారు.
ఉద్యోగులు ఇలా..
డీఈఓ కార్యాలయంతో పాటు ఎంఈఓ కార్యాలయాల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎంఈఓల కార్యాలయాల్లో 50, డీఈఓ కార్యాలయంలో 35 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ఎఫ్‌ఆర్‌ఎస్ కిందికి రానున్నారు.
31న అర్ధరాత్రి దాకా మద్యం అమ్మకాలు
భువనగిరిటౌన్ : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈనెల 31న మద్యం అమ్మకాల సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఎకై ్సజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31న జిల్లాలోని అన్ని మద్యం షాపులను అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. బార్లు, క్లబ్బులు, టూరిజం ప్రాంతాల్లోని హోటళ్లు, ప్రత్యేకంగా అనుమతి పొందిన ఈవెంట్ నిర్వాహకులకు రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలు, సరఫరా చేయడానికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.
సీతా రామచంద్ర స్వామి ఆలయ సందర్శన
మోత్కూరు : మోత్కూరు మండలం దాచారంలోని శ్రీసీతా రామచంద్ర స్వామి దేవాలయాన్ని గురువారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీ విల్లిపుత్తూర్ స్వామి మామూనుల సన్నిధి 24వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శఠగోప ముని రామానుజజీయర్ స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాశస్త్యం గురించి పూజారిని అడిగి తెలుసుకున్నారు. కోనేరు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్నె జ్యోతివీరేశం తదితరులు పాల్గొన్నారు.
పెరిగిన చలితీవ్రత
భువనగిరిటౌన్ : జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. శీతల గాలుల కారణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గురువారం రాజాపేట, బీబీనగర్, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, మోత్కూరు, రామన్నపేట మండలాల్లో 11 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో శీతల, అతి శీతల పవనాలు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తం ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గురుకులాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు
రాజాపేట : రాష్ట్రవ్యాప్తంగా జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యాలయాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల రాష్ట్ర కన్వీనర్, సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. 5,6,7,8,9 ఖాళీ సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహించి సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు గడువు జనవరి 21 వరకు ఉందని, రూ.100 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక చేసిన జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థుల నుంచి ఒక దరఖాస్తును మాత్రమే అంగీకరిస్తామన్నారు. దరఖాస్తు ఫారంపై ఒకరి ఫొటో బదులు మరొకరిది పెట్టి అప్‌లోడ్ చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. అడ్మిషన్ల ఎంపికలో ఉమ్మడి జిల్లాను పరిగణనలోకి తీసుకుంటామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సమగ్ర శిక్షా ఉద్యోగులకు ‘ఎఫ్‌ఆర్‌ఎస్’


