విద్యుత్ బిల్లుల చెల్లింపునకు క్యూఆర్ కోడ్
సిబ్బందిపై పనిభారం తగ్గుతుంది
ఆలేరు: మీటర్ రీడింగ్, బిల్లు జనరేట్‌కే పరిమితమైన స్పాట్ బిల్లింగ్ మిషన్ (ఎస్‌బీఎం)లో విద్యుత్ శాఖ క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా మీటర్ రీడింగ్ సమయంలోనే బిల్లు చెల్లించే వెసులుబాటు కల్పించింది.
గతంలో ఇలా..
విద్యుత్ సిబ్బంది ప్రతి నెల ఇంటింటికి వెళ్లి మీటర్ రీడింగ్ తీస్తారు. బిల్లు జనరేట్ అయిన తర్వాత వినియోగదారుడికి అందజేసేవారు. తర్వాత వినియోగదారులు తమ సెల్‌ఫోన్ ద్వారా గూగుల్ పే, ఫోన్‌పే ద్వారానో.. లేక విద్యుత్ కార్యాలయానికి వెళ్లి విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. గూగుల్, ఫోన్‌పే ద్వారా చెల్లింపులపై చాలా మందికి అవగాహన లేదు. పట్టణ ప్రాంతాల్లో ఈ విధానం కొంత ప్రయోజనం ఉన్నా పల్లెల్లో వినియోగదారులు ఇందుకు ఆసక్తిని కనబరచడం లేదు. దీంతో గ్రామానికి వచ్చే సిబ్బందికి వినియోగదారులు మాన్యువల్‌గా బిల్లు డబ్బులు చెల్లించేవారు. ఈ విషయంలో వినియోగదారులు, సిబ్బందికి మధ్య బిల్లు వివాదాలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి.
పారదర్శకంగా లావాదేవీలు
స్పాట్ బిల్లింగ్ మిషన్(ఎస్‌బీఎం)లో మీటర్ రీడింగ్, బిల్లు అమౌంట్ వివరాలు మాత్రమే వచ్చేవి. ఇందులో కొత్త సాఫ్ట్‌వేర్‌తో క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. గడిచిన రెండు నెలలుగా జిల్లాలో అధికారులు ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ క్యూర్ కోడ్ ద్వారా బిల్లల చెల్లింపు వల్ల లావాదేవీలు పారదర్శకంగా జరగనున్నాయి. మీటర్ రీడింగ్ సమయంలోనే ఎస్‌బీఎంలో క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి స్పాట్‌లోనే బిల్లు చెల్లించే వెసులుబాటు వినియోగదారులకు కలగనుంది.
ఫ అందుబాటులోకి తెచ్చిన విద్యుత్ శాఖ
ఫ మీటర్ రీడింగ్ సమయంలోనే
బిల్లు చెల్లించే వెసులుబాటు
కొత్తగా క్యూఆర్ కోడ్ అమల్లోకి రావడం వల్ల విద్యుత్ బిల్లుల చెల్లింపులో వినియోగదారులకు సమయం ఆదా అవుతుంది. వినియోగదారుడు, సిబ్బందికి మధ్య బిల్లు వివాదాలకు ఆస్కారం ఉండదు. మాన్యువల్‌గా వసూలు చేసి బిల్లుల డబ్బులను సిబ్బంది శాఖ రెవెన్యూ విభాగంలో జమ చేయాల్సి ఉంటుంది. తర్వాత వారు బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటారు. ఈక్యూఆర్ కోడ్ వల్ల బిల్లులు నేరుగా సంస్థ ఖాతాలో జమ అవుతాయి. సిబ్బందిపై కూడా పనిభారం తగ్గుతుంది.
– వెంకటేశ్, విద్యుత్ ఏఈ, ఆలేరు
విద్యుత్ బిల్లుల చెల్లింపునకు క్యూఆర్ కోడ్


