వినియోగదారుల హక్కులు తెలుసుకోవాలి
భువనగిరిటౌన్ : నాణ్యమైన వస్తువులు, పరిమాణం, వస్తువుల ధరల గురించి తెలుసుకునే హక్కు ప్రతి వినియోగదారుడికి ఉంటుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. రక్షణ, కల్తీ వస్తువులను అధిగమించడానికి చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. నాణ్యమైన వస్తువు సేవలను పొందడం ప్రాథమిక హక్కు అని తెలిపారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో ఉండే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందే విధంగా వినియోగదారుల హక్కుల సంఘాలు వారికి అండగా నిలబడి సేవలందించాలని కోరారు. జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లకు అవగాహన కల్పించి ఫర్టిలైజర్స్, తదితర షాపులను తనిఖీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. త్వరలో జిల్లా యంత్రాంగం విస్తృతంగా తనిఖీలు చేపట్టనున్నారని తెలిపారు. వచ్చే నెలలో సంబంధిత ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు తనిఖీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వినియోగదారులకు అందుబాటులో ఉన్న సేవల గురించి అదనపు కలెక్టర్ వీరారెడ్డి వివరించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రోజారాణి, జిల్లా మేనేజర్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారి హరికృష్ణ, ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి, జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ, జిల్లా మెట్రాలిజీ అధికారి వెంకటేశ్వర్లు, వినియోగదారు ల ఫోరం సభ్యులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


