నోటాకు 1,309 ఓట్లు
చెల్లని ఓట్లు ఎక్కువే..
భూదాన్‌పోచంపల్లి: తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో ఒకటి అంతకంటే రెండు, మూడు ఓట్ల తక్కువ మెజారిటీతో సర్పంచ్, వార్డుసభ్యుల పదవులు చేజారిపోయాయి. మరికొన్ని చోట్ల అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో టాస్ పద్ధతిలో పదవులు వరించాయి. ఈ సారి ఎన్నికల సంఘం నోటాను కూడా ప్రవేశపెట్టడంతో ఓటర్లు తమకు నచ్చని అభ్యర్థులకు బదులు నోటాకు ఓటు వేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సర్పంచ్‌లుగా ఇష్టం లేదంటూ జిల్లా వ్యాప్తంగా 1309 మంది నోటాకే ఓటు వేశారు. ఎక్కువగా బీబీనగర్ మండలంలో 151 ఓట్లు, వలిగొండలో 125, రాజాపేట 109 వచ్చాయి. అతితక్కువగా మోత్కూర్ మండలంలో 21, ఆలేరులో 43 ఓట్లు వచ్చాయి. ఓటు వేసే విధానంపై కొందరికి అవగాహన కొరవడి సర్పంచ్‌లకు సంబంధించి 5698 ఓట్లు చెల్లకుండా పోయాయి.
మొదటిసారి నోటా
ఎన్నికల కమిషన్ మున్సిపల్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను ఈవీఎంల ద్వారానే నిర్వహించి.. అందులో నోటాను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి మొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్నికల సంఘం నోటాను ప్రవేశపెట్టింది. పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే ఆ ఓటరు ఎవరు నచ్చలేదంటూ తమ అభిప్రాయం తెలియజేసేలా నోటా గుర్తును సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పేపర్‌పై ముద్రించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 1309 మంది ఓటర్లు సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి బ్యాలెట్‌పై నోటాకు ఓటు వేసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
మూడు విడతల్లో ఎన్నికలు
జిల్లాలో మూడు విడతల్లో (ఈనెల 11, 14, 17 తేదీల్లో )ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 427 గ్రామ పంచాయతీలు, 3,704 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 5,32,240 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. మొదటి విడతలో 1,44,483 మంది ఓటర్లు, రెండో విడతలో 1,5,937 మంది, మూడో విడతలో 1,47,432 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 4,77,852 మంది పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారు.
చెల్లని ఓట్లు 5,698
ఫ పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటా
ఫ అత్యధికంగా బీబీనగర్ మండలంలో నోటాకు పోలైన 151 ఓట్లు
నోటాతో పాటు చెల్లని ఓట్లు కూడా ఎక్కువగానే వచ్చాయి. అధికారులు ఓటర్లకు సరైన అవగాహన కల్పించకపోవడంతో వృద్ధులైన ఓటర్లు ఓటు వేసేటప్పుడు తికమకపడి ఒకటి కంటే ఎక్కువ అభ్యర్థులకు ఓటు వేయడం, లేదా సరైన స్థానంలో స్వస్తిక్ గుర్తు వేయకపోవడంతో చాలా ఓట్లు చెల్లకుండా పోయాయి. యాదాద్రి జిల్లాలోనే 5698 చెల్లని ఓట్లు పోలయ్యాయి. ఎక్కువగా వలిగొండ మండలంలో 606, రామన్నపేటలో 496, రాజాపేటలో 440 చెల్లని ఓట్లు వచ్చాయి. తక్కువగా మోత్కూర్ మండలంలో 144, ఆలేరులో 252 ఓట్లు వచ్చాయి. ఈలెక్కన యాదాద్రి భువనగిరి జిల్లాలో నోటా, చెల్లని ఓట్లు కలుపుకొని మొత్తం 7,007 ఓట్లు ఉన్నాయి.


