ఫ్లెక్సీల వార్..
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీల లొల్లి నెలకొంది. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ వైకుంఠద్వారం రింగ్ రోడ్డు వద్ద ఎలాంటి రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని ఇటీవల ఆలయాధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో మంగళవారం యాదగిరిగుట్టలో సర్పంచ్‌ల సన్మానోత్సవానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ వస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిల ఫొటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలను సోమవారం రాత్రి వైకుంఠద్వారం ఎదుట సర్కిల్ వద్ద ఏర్పాటు చేశారు. గమనించిన బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, యూత్ నాయకులు ఆవుల సాయి ఆధ్వర్యంలో సోమవారం అర్థరాత్రి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రదేశంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. పోలీసులు అక్కడుకు చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులతో బీఆర్‌ఎస్ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహించిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలను చింపేశారు. దీంతో పోలీసులు కర్రె వెంకటయ్య, ఆవుల సాయి యాదవ్‌లతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించి, అనంతరం విడిచిపెట్టారు.
యాదగిరి కొండపై ఆందోళన
గతంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించిన ఆలయ అధికారులు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీవి ఎందుకు తొలగించలేదని యాదగిరి కొండపైన గల పరిపాలన కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. అదేవిధంగా వైకుంఠద్వారం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో యాదగిరి క్షేత్రానికి వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆలయ ఈఓ వెంకట్రావ్‌కు వినతిపత్రం అందజేశారు.
ఫ వైకుంఠద్వారం సర్కిల్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు
ఫ బీఆర్‌ఎస్ నాయకులు వాటిని చించి
వేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం


