జీతం విషయంలో గొడవ
నకిరేకల్ : జీతం విషయంలో జరిగిన ఘర్షణలో మేనమామను మేనల్లుడు హతమార్చాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలో నివాసముంటున్న యలగందుల వెంకన్న(50) కోడిగుడ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె పెళ్లి కాగా.. కుమారుడు రాకేష్‌కు 2023లో గుజరాత్ రాష్ట్రం సూరత్‌కు చెందిన దివ్యతో వివాహం జరిగింది. ప్రస్తుతం రాకేష్ భార్య సూరత్‌లోనే ఉంటోంది. వెంకన్న భార్య మూడేళ్ల క్రితం క్యాన్సర్‌తో మృతిచెందింది. వెంకన్న మేనల్లుడు గట్టు శ్రీకాంత్ నకిరేకల్‌లో మిల్క్ సెంటర్ నడిస్తున్నాడు. వెంకన్న తన కుమారుడు రాకేష్‌ను మేనల్లుడు శ్రీకాంత్ వద్ద పాల వాహనంపై డ్రైవర్‌గా నెలకు రూ.16 వేల వేతనానికి పని కుదిర్చాడు. గత ఏడు నెలలుగా రాకేష్ పాల వాహనం డైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి వెంకన్న తన మేనల్లుడు శ్రీకాంత్ నిర్వహిస్తున్న మిల్క్ సెంటర్ వద్దకు వచ్చాడు. అక్కడే రాకేష్, శ్రీకాంత్ మిత్రుడు నకిరేల్‌కు చెందిన పుట్ట కిరణ్ ఉన్నాడు. అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో వెంకన్న తన కుమారుడు రాకేష్‌కు ఇచ్చే జీతం విషయమై మేనల్లుడు శ్రీకాంత్‌తో గొడవపడ్డాడు. దీంతో వెంకన్న, శ్రీకాంత్ మద్య ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో రాకేష్ అడ్డుపడగా అతడిని శ్రీకాంత్ పాల ట్రేతో కొట్టబోయాడు. రాకేష్ తండ్రి వెంకన్న అడ్డురాగా పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకతో అతడి తలపై బలంగా కొట్టాడు. దీంతో తల పగిలి వెంకన్న స్పృహ కోల్పోయాడు. గాయపడని వెంకన్న, రాకేష్‌ను 108 వాహనంలో నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వెంకన్న మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాకేష్‌ను నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత శ్రీకాంత్ పరారయ్యాడు. రాకేష్ సోమవారం నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, ఎస్‌ఐ వీరబాబు తెలిపారు. శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ఫ మేనమామను కడతేర్చిన మేనల్లుడు
ఫ మృతుడి కుమారుడికి గాయాలు
ఫ నకిరేకల్ పట్టణంలో ఘటన


