ప్రమాణ స్వీకారం చేయకుండానే ఉప సర్పంచ్ పదవికి రాజీనామా
గుండాల : ప్రమాణ స్వీకారం చేయకుండానే ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేసిన ఘటన గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామంలో 10 వార్డులు ఉండగా.. సర్పంచ్ గద్వాల ఉపేందర్‌తో పాటు 9 మంది వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. 10వ వార్డు సభ్యుడైన రస్తాపురం చంద్రును శనివారం అధికారుల సమక్షంలో వార్డు సభ్యులంతా కలిసి ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. కానీ ప్రమాణ స్వీకారానికి చంద్రు హాజరుకాలేదు. అయితే చంద్రు వ్యక్తిగత కారణాలతో ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీడీఓ చండీరాణికి రాజీనామా పత్రం అందజేశారు. రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేసినట్లు ఎంపీడీఓ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు.


