యాదగిరి క్షేత్రంలో నేత్రపర్వంగా ఊంజల్ సేవ
యాదగిరిగుట్ట : యాదగిరి క్షేత్రంలో శుక్రవారం నిత్యారాధనల్లో భాగంగా ఆండాళ్‌దేవికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు నేత్రపర్వంగా చేపట్టారు. ఈ సందర్భంగా అమ్మవారిని అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలోని ప్రత్యేక వేదికపై అమ్మవారిని అధిష్టింపజేసి ఆగమశాస్త్రం ప్రకారం ఊంజల్ సేవ నిర్వహించారు. అంతకుముందు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తుల చెంత అభిషేకం, సహస్రనామార్చన జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సం తదితర పూజలు నిర్వహించారు.


