పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు భేష్..
భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో కళాత్మకంగా ఉన్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెక్రటరీ దీప్తి ఉమాశంకర్ అన్నారు. శుక్రవారం ఆమె భూదాన్‌పోచంపల్లిని సందర్శించి టూరిజం పార్కులో మగ్గాలను పరిశీలించారు. ఇక్కత్ వస్త్రాల తయారీ విధానాలను తిలకించారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతయంగా ఉన్న గుర్తింపు తెలుసుకొని చేనేత కళాకారుల నైపుణ్యాన్ని అభినందించారు. అనంతరం చేనేత సహకార సంఘాన్ని సందర్శించి ఇక్కత్ వస్త్రాలు, డిజైన్‌లను పరిశీలించి చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. గతంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పోచంపల్లిని సందర్శించారని తెలుసుకొని ఈ ప్రాంత చరిత్రక, వృతికళాకారుల గొప్పదనాన్ని అభినందించారు.
పోచంపల్లిలో పీఎస్సీ చైర్మన్ల కుటుంబ సభ్యులు
ఇక్కత్ వస్త్రాల తయారీ తీరుతెన్నులను ప్రత్యక్షంగా చూసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిప్యూటీ సెక్రటరీ సరిత ఆధ్వర్యంలో 15 రాష్ట్రాలకు చెందిన పబ్లిక్ సర్వీస్ కమిషన్(పీఎస్సీ) చైర్మన్ల కుటుంబ సభ్యులు 25 మంది శుక్రవారం పోచంపల్లిని సందర్శించారు. స్థానిక టూరిజం పార్కు, చేనేత గృహాలు, చేనేత సహకార సంఘాన్ని సందర్శించారు. అక్కడ మగ్గాలు, చిటికి కట్టడం, మగ్గం నేయడం, రంగులద్దకం, ఆసుపోయడం తదితర విధానాలను పరిశీలించారు. చేనేత గృహాలను సందర్శించి మగ్గం నేస్తే ఎంత కూలీ వస్తుందని, తయారు చేసిన వస్త్రాలను ఎక్కడ విక్రయిస్తారని అడిగి తెలుసుకున్నారు. చేనేత సహకార సంఘంలో చేనేత వస్త్రాలు, డిజైన్లలను పరిశీలించి వస్త్రాలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోచంపల్లిని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందనన్నారు. వీరికి జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీ శ్రీనివాస్‌రావు, పోచంపల్లి టై అండ్ డై అసోషియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, పోచంపల్లి ప్రొప్రైటర్ కంపెనీ చైర్మన్ తడక రమేశ్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్ పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి. శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, చేనేత జౌళిశాఖ డీఓ మోహన్‌రెడ్డి, చేనేత నాయకులు ముస్కూరి నర్సింహ, గంజి అంజయ్య, మేనేజర్ రుద్ర అంజనేయులు పాల్గొన్నారు.
ఫ రాష్ట్రపతి సెక్రటరీ దీప్తి ఉమాశంకర్
పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు భేష్..


