గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు
కేతేపల్లి : కేతేపల్లి మండలం చీకటిగూడెం శివారులో మూసీ కుడి కాల్వలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం శుక్రవారం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చీకటిగూడెం గ్రామానికి చెందిన రైతు వడ్డె రవి బుధవారం గ్రామ శివారులో మూసీ కుడి కాల్వ పక్కన ఉన్న తన పొలం వద్దకు బయల్దేరాడు. తన పొలం వద్దకు వెళ్లాలంటే మూసీ కాల్వను దాటాల్సి ఉంది. రాత్రయినా రవి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గురువారం పొలం వద్దకు వెళ్లగా.. అతడి బైక్, చెప్పులు అక్కడే ఉన్నాయి. రవి మూసీ కాల్వను దాటే క్రమంలో నీటి ఉధృతికి కొట్టుకుపోయాడనే అనుమానంతో పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు మూసీ ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి కాల్వకు నీటిని విడుదలను నిలిపి వేయించారు. కాల్వ వెంట, కాల్వ నీరు వెళ్లే తుంగతుర్తి, చెర్కుపల్లి చెరువుల్లో గాలించినా గురువారం రాత్రి వరకు రవి ఆచూకీ లభించలేదు. శుక్రవారం నకిరేకల్ ఫైర్ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి చీకటిగూడెం శివారు నుంచి చెర్కుపల్లి, తుంగతుర్తి గ్రామాల చెరువుల వరకు ప్రధాన కాల్వలో గాలించాయి. పడవల సహాయంతో ఆయా గ్రామాల చెరువుల్లో ముమ్మరంగా గాలించారు. అయినా శుక్రవారం రాత్రి వరకు కూడా రవి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే చెర్కుపల్లి శివారులో మూసీ కాల్వపై నేల మోరీ(అండర్ టన్నెల్) నిర్మాణం కోసం వేసిన ఇరుకై న సిమెంట్ గూనలో రవి మృతదేహం ఇరికి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాల్వలో నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిన తర్వాతనే గూనలోకి వెళ్లి వెతికేందుకు వీలవుతుంది. రెండు రోజులవుతున్నా రవి ఆచూకీ లభ్యం కాకపోవటంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.


