ఎలక్ట్రికల్ క్లీనింగ్ వాహనాలు ఏర్పాటు చేయాలి
యాదగిరిగుట్ట: యాదగిరి కొండకు దిగువన ఆధ్యాత్మికవాడలో నూతనంగా ప్రారంభించిన శాంత రుశ్య శృంగ అన్నప్రసాద కేంద్రంలో ఎప్పటికప్పుడు పరిశుభ్రతగా ఉండే విధంగా ఎలక్ట్రికల్ క్లీనింగ్ వాహనాలు ఏర్పాటు చేసి, వినియోగంలోకి తేవాలని ఆలయ ఈఓ వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. గురువారం అన్న ప్రసాద కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అన్న ప్రసాదం అందిస్తున్న తీరును పరిశీలించి, భక్తుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం క్యూలైన్ నిర్వహణ, భక్తులు వేచి ఉండే హాల్‌లో భద్రతా ఏర్పాట్లు, అన్న ప్రసాదం రుచి, నాణ్యత, పరిశుభ్రత అంశాలపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల రద్దీని బట్టి క్యూలైన్ వ్యవస్థలో అవసరమైన చోట సవరణలు చేయడానికి భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేసినట్లు చెప్పారు. అనంతరం తాగునీటి శుద్ధి వ్యవస్థను పరిశీలించి, జల ప్రసాద నీటి స్వచ్ఛతను నిర్ధారించారు. ఆయన వెంట సంబంధిత అధికారులున్నారు.


