వరి నాట్లలో మెళకువలు | - | Sakshi
Sakshi News home page

వరి నాట్లలో మెళకువలు

Dec 19 2025 7:35 AM | Updated on Dec 19 2025 7:35 AM

వరి న

వరి నాట్లలో మెళకువలు

నారుమళ్లకు కోతుల బెడద

జింకు లోప లక్షణాలు

త్రిపురారం, నడిగూడెం : ప్రస్తుతం యాసంగి సీజన్‌ ప్రారంభమైంది. రైతులు ఇప్పటికే నీటి సౌకర్యం ఉన్న చోట ముమ్మరంగా వరి నాట్లు వేసుకుంటున్నారు. వరి నాట్లు వేయడంలో సరైన మెళకువలు పాటించాలని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కంపాసాగర్‌ సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్‌, నడిగూడెం మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్‌ సూచిస్తున్నారు.

పొలం తయారీ విధానం

నాట్లు వేయడానికి 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయుట ప్రారంభించాలి. 2–3 దఫాలుగా మురగ దమ్ము చేయాలి. పొలమంతా సమానంగా దమ్ము చెక్కతో లేదా అడ్డతో చదును చేయాలి. రేగడి భూముల్లో నాట్లు వేయడానికి 2 రోజుల ముందుగానే దమ్ము పూర్తిచేసి, ఆ తర్వాతనే నాట్లు వేస్తే మంచిది.

నాట్లు వేసే విధానం

నారు తీసేటప్పుడు మొక్కలు లేత ఆకుపచ్చగా ఉంటేనే నాటు త్వరగా కుదురుకుంటుంది. నాలుగు నుంచి ఆరు ఆకులున్న నారును ఉపయోగించాలి. దీర్ఘ, మద్యకాలిక నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ప్రస్తుత యాసంగి సీజన్‌లో చదరపు మీటరుకు 44 కుదుళ్లు ఉండేలా చూడాలి. నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలి బాటలు తీయాలి. దీంతో పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతిని కొంతవరకు అదుపు చేయవచ్చు. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వేయడానికి ఇంకా పైరు పరిస్థితిని గమనించడానికి ఈ బాటలు బాగా ఉపయోగపడతాయి. వరి రకాల కాలపరిమితిని బట్టి కుదుళ్ల సంఖ్యను నిర్ధారించాలి. భూసారం ఎక్కువ ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్లు, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్లు ఉండేటట్లు నాటాలి. ముదురు నారు నాటినప్పుడు కుదుళ్ల సంఖ్యను పెంచి, కుదురుకు 4–5 మొక్కల చొప్పున నాటు వేయాలి. ఇలా ముదురు నారు నాటినప్పుడు నత్రజని ఎరువును సిఫారసు కంటే 25 శాతం పెంచి రెండు దఫాలుగా అంటే 70 శాతం దమ్ములో, మిగతా 30 శాతం అంకురం దశలోనూ వాడాలి.

ఎరువుల యాజమాన్యం

● నత్రజని మూడు సమభాగాలుగా వేసి నాటుకు ముందు దమ్ములో, అంకుర దశలో, బురద పదునులో సమానంగా చల్లుకోవాలి. ఎరువులు చల్లిన 30గంటల తర్వాత నీరు పెట్టడం ఉత్తమం.

● నత్రజనిని కాంప్లెక్స్‌ ఎరువుల రూపంలో లేదా యూరియా రూపంలో లేదా నానో యూరియా రూపంలో అందించవచ్చు. శాస్త్రవేత్తల సూచనల మేరకు యూరియాను తక్కువగా వినియోగించుకోవాలి.

● 40కిలోల యూరియా 10కిలోల వేప పిండి, లేదా 250కిలోల తేమ కలిగిన మట్టిని కలిపి రెండు రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది.

● మట్టి పరీక్షల ఆధారంగా మొత్తం భాస్వరం ఎరువులను దమ్ములోనే వేసుకోవాలి.

● పొటాష్‌ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేసుకోవాలి. చెల్క నేలల్లో ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగితా సగ భాగాన్ని వేసుకోవాలి.

● కాంప్లెక్స్‌ ఎరువులను పైపాటుగా దుబ్బు చేసే సమయంలోగాని అంకురం ఏర్పడే దశలోగాని వేయకూడదు. పూర్తిగా దమ్ములో వేసుకోవాలి.

నిడమనూరు : నిడమనూరు మండలంలో కోతుల బెడద తీవ్రమైంది. మండల కేంద్రం శివారులో వరి నారుమడులను సైతం ధ్వంసం చేస్తున్నాయి. వరి నారు పెరుగుతున్న క్రమంలో కోతులు తొక్కి, ధ్వంసం చేస్తున్నాయి. దీంతో వరి నారు నాటుకు పనికిరాకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో సైతం పలువురు అభ్యర్థులు కోతుల బెడద నివాస్తామని హామీ ఇచ్చారు.

పై నుంచి 3 లేదా 4 ఆకుల మధ్య ఈనె పాలి పోతుంది. నాటిన 2 నుంచి 4 లేదా 6 వారాల్లో ముదురు ఆకు చివర్లో, మధ్య ఈనెకు ఇరుపక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నవిగా, పెళుసుగా ఉండి వంచగానే శబ్ధం చేస్తూ విరిగిపోతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు చేయవు. నత్రజని ఎరువులు దమ్ములో వేసినప్పటికి పైరు పచ్చబడదు.

సవరణ : ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి, రెండు పంటలు పండించేట్లయితే ప్రతి రబీ సీజన్‌లో, ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్‌ వేయాలి. లేదా పైరుపై జింకు లోపం కన్పించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్‌ చొప్పున 5 రోజుల వ్యవధిలో 2,3 సార్లు పిచికారీ చేయాలి.

గమనిక : భాస్వరం ఎరువుతో జింకు సల్ఫేట్‌ను కలిపి వేయరాదు. కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి. కలిపి వేస్తే రసాయనిక చర్యవల్ల ఫలితం ఉండదు. జింకు సల్ఫేట్‌ ద్రావణంలో పురుగు, తెగుళ్ళ మందులను కలుపరాదు.

వరి నాట్లలో మెళకువలు1
1/1

వరి నాట్లలో మెళకువలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement