స్పీకర్ నిర్ణయం ఆక్షేపణీయం
సాక్షి, యాదాద్రి : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం ఆక్షేపణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. ఫిరాయింపుల నిరోధక బిల్లు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ.. దాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని అతిక్రమించిందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లను రామచందర్‌రావు గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో విజయం.. గ్రామీణాభివృద్ధి పట్ల మోదీ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ప్రతిబింబమన్నారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు అనుగుణంగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి పార్టీ విస్తరణకు ఈ విజయాలు పునాది ఏర్పాటు చేస్తాయన్నారు. గ్రామస్థాయి నుంచే బీజేపీ సంస్థాగతంగా బలోపేతం అవుతుందన్నారు. పట్టణాలకే పరిమితమైన పార్టీ పల్లెల్లో కూడా విస్తరిస్తుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేయలేకపోయినా, పోటీ చేసిన చోట్ల బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక నాయకుల నుంచి బెదిరింపులు, ఒత్తిడులు ఎదురైనా, ప్రజలు ధైర్యంగా బీజేపీకి మద్దతుగా నిలిచారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది సర్పంచులు, 1200 మంది ఉప సర్పంచులు, 10,000 మందికి పైగా వార్డు మెంబర్లు బీజేపీ తరఫున గెలిచారన్నారు. 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే పూర్తి విశ్వాసం ఉందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 8వేల సర్పంచులు ఉండగా నేడు ఆ పార్టీ నుంచి సర్పంచ్‌ల సంఖ్య 2 వేల వరకు పడిపోయిందని, ఆ పార్టీ గ్రాఫ్ మరింత దిగజారిందనడానికి నిదర్శనమన్నారు. ఉచిత బియ్యం, ధాన్యం కొనుగోలుతో పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేస్తోందని ఆయన వివరించారు. బీజేపీ భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఉపాధ్యక్షులు డాక్టర్ బూరనర్సయ్యగౌడ్, కాసం వెంకటేశ్వర్లు, గూడూరు నారాయణరెడ్డి, పాశం భాస్కర్, పడాల శ్రీనివాస్, పీఎస్ రవీందర్, దాసరి మల్లేశ, చందా మహేందర్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
ఫ రాజ్యాంగాన్ని అతిక్రమించడమే
ఫ రాష్ట్రాభివృద్ధికి డబుల్
ఇంజన్ సర్కార్ రావాలి
ఫ సర్పంచ్‌ల గెలుపుతో
పల్లెల్లో బీజేపీ పాగా
ఫ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
రాంచందర్‌రావు


