
నారసింహ.. నిర్లక్ష్యం వదిలించుమా!
ఇప్పటికైనా జాప్యాన్ని వీడాలి
లక్షలాది రూపాయలు వెచ్చించి కృత్రిమంగా వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయడం సంతోషం. నాలుగేళ్ల క్రితమే పనులు పూర్తయినా ఉపయోగంలోకి తేకపోవడంపై ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వాటర్‌ఫాల్స్‌ను ప్రారంభిస్తే క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆహ్లాదాన్ని పొందేందుకు వీ లుంటుంది. ఆలయ అధికారులు ఇప్పటికై నా జాప్యాన్ని వీడి జలపాతాన్ని ప్రారంభించాలి.
– గంగసాని నవీన్, భక్తుడు, యాదగిరిగుట్ట
రూ.లక్షలు వెచ్చించి వదిలేశారు
భక్తులు చాలామంది మొదటి ఘాట్ రోడ్డు గుండా కాలినడకన కొండపైకి వెళ్తుంటారు. ఇదే మార్గంలో తిరుగు ప్రయాణమవుతుంటారు. లక్షలు వెచ్చింది ఏర్పాటు చేసిన వాటర్‌ఫాల్స్‌ను నిరుపయోగంగా ఉంచడం తగదు. కొండపైన భక్తుల సౌకర్యాలపై దృష్టిసారించిన విధంగానే ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన వాటర్‌ఫాల్స్‌ను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి.
– కర్రె ప్రవీణ్,
బీజేపీ యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి సన్నిధికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం పంచేందుకు మొదటి ఘాట్ రోడ్డులో వాటర్‌ఫాల్స్ ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల క్రితమే పనులు పూర్తిచేసినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. ప్రత్యేక వాటర్ పైప్‌లైన్ ఏర్పాటు చేసి, కొండ పైనుంచి కిందకు నీళ్లు జారేవిధంగా కృతిమ పద్ధతిలో జలపాతాన్ని తీర్చిదిద్దారు. ఇందుకోసం వైటీడీఏ లక్షలాది రూ పాయలు ఖర్చు చేసింది. భక్తులు తిరుగు ప్రయాణంలో వాటర్‌ఫాల్స్ చెంత సేదదీరి, ఆహ్లాదం పొందటానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు.
పలుమార్లు ట్రయల్ రన్
వాటర్‌ఫాల్స్‌ను పలుమార్లు విజయవంతంగా ట్రయల్‌రన్ నిర్వహించారు. కొండపై నుంచి నీళ్లు జాలువారుతూ అద్భుతంగా కనువిందు చేసింది. అంతేకాకుండా ప్రకృతి సిద్ధంగా కనిపించేలా వాటర్ ఫాల్స్‌కు ఇరువైపులా చెట్లను పెంచారు. మధ్య రంగురంగుల పూల మొక్కలు నాటారు. ట్రయల్ రన్ నిర్వహించిన సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ సేదదీరడంతో పాటు ఫొటోలు దిగుతూ కనిపించేవారు. ప్రధానాలయం పునఃప్రారంభ సమయంలోనే వాటర్‌ఫాల్స్‌ను కూడా భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. కానీ, వీలు కుదరకపోవడంతో వాయిదా వేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు వాటర్‌ఫాల్స్ ప్రారంభంపై దృష్టి సారించకపోవడంతో అలంకారప్రాయంగా మారింది. ఇప్పటికై నా అందుబాటులోకి తేవాలని భక్తులు కోరుతున్నారు.
యాదగిరి క్షేత్రంలో భక్తులకు ఆహ్లాదం పంచని వాటర్‌ఫాల్స్
నాలుగేళ్ల క్రితం మొదటి ఘాట్ రోడ్డులో ఏర్పాటు
ప్రారంభానికి కుదరని ముహూర్తం

నారసింహ.. నిర్లక్ష్యం వదిలించుమా!

నారసింహ.. నిర్లక్ష్యం వదిలించుమా!