
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలో ఆర్యవైశ్య సత్రం నుంచి జీయర్ కుటీర్ సమీపం వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం ఆర్‌అండ్‌బీ ఏఈఈ భరత్, ట్రాఫిక్ సీఐ ఎలగొండ కృష్ణతో కలిసి ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి ఆయా ప్రాంతాలను పరిశీ లించారు. గుట్ట నుంచి మల్లాపురం, తుర్కపల్లి వైపు వెళ్లే ప్రయాణికులు, యాదగిరి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను ఎక్కడి నుంచి మళ్లించే అంశంపై చర్చించారు. ఫ్లై ఓవర్ పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆయన వెంట ట్రాఫిక్ ఎస్సైలు దేవేందర్, రాజు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.
గుట్ట శివాలయంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఉదయం శివాలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన, ముఖమండపంలోని స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చన చేశారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో వెండిజోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు.
దూర విద్యతోనూ ఉజ్వల భవిష్యత్
భువనగిరి, ఆలేరు : దూర విద్యతోనూ ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ధర్మానాయక్ అన్నారు. భువనగిరిలోని శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి డిగ్రీ కళాశాలలోని స్టడీ సెంటర్‌ను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. సైన్స్ ప్రాక్టికల్స్ నిర్వహణకు అవసరమైన సౌకర్యాలపై యూనివర్సిటీ వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఓపెన్ యూనివర్సిటీలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశం ఉందన్నారు. అనంతరం ఆయనను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, స్టడీ సెంటర్‌కో ఆర్డినేటర్ రమేష్ సన్మానించారు. అదే విధంగా ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్టడీ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ప్రతి కౌన్సిలర్ 50 అడ్మిషన్‌లు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ బాలయ్య, అధ్యాపకులు బాల్‌రెడ్డి, కిష్టయ్య, సత్యనారాయణ, సుదా, పాండురంగం, బాలరాజు, అసిఫ్ అలీ, లింగమూర్తి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు