
అధికంగా భూ సమస్యలపైనే..
వేతనాలు విడుదల చేయాలని వినతి
భువనగిరిటౌన్ : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 60 అర్జీలు వచ్చాయి. అధికంగా రెవెన్యూ సమస్యలపై 44 వినతులు ఉన్నాయి. కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు, ఉన్నతాధికారులు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అర్జీలను పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అత్యవసరం అయితే తప్ప.. తప్పనిసరిగా ప్రజవాణికి హాజరుకావాలని, కిందిస్థాయి ఉద్యోగులను పంపవద్దని సూచించారు. ఉన్నతాధికారులను కలిసి తమ బాధలు తెలియజేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోడ్చి ప్రజలు వస్తుంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు.
● బొమ్మలరామారం మండలం జలాల్‌పురం జెడ్పీహెచ్‌ఎస్ నుంచి ముగ్గురు ఉపాధ్యాయులను సద్దుబాటుపై ఇతర స్కూళ్లకు పంపారని, వారిని వెంటనే వెనక్కి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
● ఇస్కాన్, హరేకృష్ణ సంస్థల అధ్వర్యంలో కలెక్టరేట్‌లో రూ.5కు భోజన కేంద్రం ఏర్పాటు చేయాలని శ్రీశైలం, జేహెచ్ రావు, హర్షవర్ధన్ తదితరులు కలెక్టర్‌కు విన్నవించారు. కలెక్టరేట్‌కు వివిధ పనుల నిమిత్తం వచ్చేవారిలో ఆర్థిక స్థోమత లేని వ్యక్తులు బయట తినలేకపోతున్నారని, సంస్థ నిర్వాహకులతో మాట్లాడాలని కోరారు.
● నూతన వీఓఏను నియమించాలని యాదగిరిగుట్ట మండలంలోని కాచారం గ్రామ మహిళా సంఘాల ప్రతినిధులు కోరారు. ఆమైపె ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నాలుగు నెలల క్రితం విధుల నుంచి తొలగించారని, మరొకరిని నియమించకపోవడంతో సంఘాల నిర్వహణ, కొత్త సంఘాల ఏర్పాటుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కోరుతూ 104 ఉద్యోగులు కలెక్టర్‌కు విన్నవించారు. జిల్లా వ్యాప్తంగా 31 మంది విధులు నిర్వహిస్తున్నారని, ఐదు నెలలుగా వేతనం రాకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, మారయ్య, శ్రీనివాస్, హరి బాబు, స్వామి, సతీష్, శివకుమార్ పాల్గొన్నారు.