
యువతిని మోసం చేసిన వ్యక్తికి రిమాండ్
చౌటుప్పల్: తల్లిదండ్రులపై కోపంతో హైదరాబాద్‌కు వచ్చిన యువతికి ఉపాధి చూపించి, ఆమెను నమ్మించి గర్భవతిని చేసిన వ్యక్తిని చౌటుప్పల్ పోలీసులు ఆదివారం రిమాండ్‌కు తరలించారు. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన యువతి 2024లో తల్లిదండ్రులతో గొడవపడి ఆవేశంలో ఎవరికీ చెప్పకుండా బస్సు ఎక్కి హైదరాబాద్‌కు వచ్చింది. అక్కడ ఇమ్లీబన్ బస్‌స్టేషన్‌లో బస్సు దిగింది. ఈ క్రమంలో బస్‌స్టేషన్‌లోనే కొంతమంది వ్యక్తులను ఏదైనా పని ఉంటే చెప్పండని అడిగింది. ఓ వ్యక్తి సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన పంది పరమేశ్వర్ అలియాస్ ఈశ్వర్ పేరు చెప్పి అతడి సెల్ నంబర్‌ను యువతికి ఇచ్చాడు. అతడిని సంప్రదిస్తే పని చూపిస్తాడని చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు.
ఉపాధి చూపించి యువతికి దగ్గరై..
సెల్ నంబర్ తీసుకున్న ఆ యువతి వెంటనే పరమేశ్వర్‌కు ఫోన్ చేసి ఉపాధి కల్పించాలని కోరింది. దీంతో ఆమెను తాను మార్కెటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తున్న హైదరాబాధ్‌లోని కొత్తపేటలో గల రియల్‌ఎస్టేట్ ఆఫీస్ వద్దకు రమ్మన్నాడు. చెప్పినట్లుగానే ఆ యువతికి తాను పనిచేసే కార్యాలయంలోనే పరమేశ్వర్ ఉద్యోగం ఇప్పించాడు. కొంతకాలం తర్వాత హైదరాబాద్‌లోని నాగోల్‌లో గల వృద్ధాశ్రమంలో పనికి పెట్టించాడు. అలా యువతిని బాగా నమ్మించాడు. ఈ క్రమంలో ఆమెను లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. దీంతో సదరు యువతి నుంచి పరమేశ్వర్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. అప్పటికే పైళ్లె భార్యాపిల్లలు కల్గి ఉన్న పరమేశ్వర్‌కు ఏమి చేయాలో తెలియక యువతిని హైదరాబాద్‌లోని చైతన్యపురిలో హాస్టల్‌లో చేర్పించి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడికి సదరు యువతి ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువతి చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన అక్కడి పోలీసులు కేసును చౌటుప్పల్‌కు బదిలీ చేశారు. సీఐ మన్మథకుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసులు పరమేశ్వర్‌ను అదుపులోకి తీసుకుని ఆదివారం చౌటుప్పల్‌లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్డు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అనంతరం నిందితుడిని నల్లగొండలోని జైలులో రిమాండ్ చేశారు.