గుర్తుతెలియని వాహనం ఢీకొని..
నాగారం: రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై నాగారం బంగ్లా పరిధిలోని విజయనగర్ కాలనీ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం మండల పరిధిలోని పసునూర్ గ్రామానికి చెందిన కడారి శ్రీను(45) కొంతకాలంగా హైదరాబాద్‌లోని బీఎన్‌రెడ్డి కాలనీలో నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం నాగారం మండలం డి. కొత్తపల్లి గ్రామంలో గంగదేవమ్మ పండుగ చేయడంతో తన బంధువైన బీసు నర్సయ్య ఇంటికి వచ్చాడు. రాత్రి 1:30 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లేందుకు నడుచుకుంటూ నాగారం వైపు వస్తుండగా.. మార్గమధ్యలో నాగారం బంగ్లా పరిధిలోని విజయనగర్ కాలనీ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మంగళవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి పెద్ద కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఐలయ్య తెలిపారు.


