పల్లె పాలన పగ్గాలు
సర్పంచ్‌ల చేతుల్లోకి
సాక్షి, యాదాద్రి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన పాలకవర్గాలతో ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం జరిగిన మొదటి సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్‌లు.. సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 427 గ్రామ పంచాయతీల్లో పండుగ వాతావరణం నెలకొంది.
పాలకవర్గాలను సత్కరించిన ప్రజాప్రతినిధులు
భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని పలు పంచాయతీల్లో పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సైదాపురంతో పాటు నియోజకవర్గంలో తన మద్దతుదారులు గెలిచిన వివిధ గ్రామాల్లో ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు. సర్పంచ్‌లను సీట్లలో కూర్చోబెట్టి శాలువాలతో సన్మానించారు. భువనగిరి నియోజకవర్గంలో వలిగొండ, భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్, భువనగిరి తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంస్థాన్‌నారాయణపురం పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి వలిగొండ మండలం నెమలికాల్వతో పాటు పలు గ్రామాల్లో పాల్గొనగా, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆత్మకూర్(ఎం) పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.
పల్లెల్లో కోలాహలం
నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు పండుగ వాతావరణంలో బాధ్యతలు స్వీకరించారు. తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కొందరు సర్పంచ్‌లు భోజనాలు ఏర్పాటు చేశారు. మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. పాలకవర్గ సభ్యులను ఆయా పార్టీల నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు సన్మానించడంతో పల్లెల్లో కోలాహలం నెలకొంది.
పంచాయతీల్లో కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు
ఫ పండుగ వాతావరణంలో సర్పంచ్‌లు, వార్డుసభ్యుల ప్రమాణస్వీకారం
ఫ హాజరైన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు
ప్రశాంతంగా ప్రమాణస్వీకారోత్సవం
జిల్లాలోని 427 గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల ప్రమాణస్వీకారోత్సవం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మూడు గ్రామాల్లో ఒక్కో వార్డుకు ఎన్నికలు జరగలేదు. గుండాల మండలం బండకొత్తపల్లి ఉపసర్పంచ్ తన పదవికి రాజీనామా చేస్తూ లిఖితపూర్వకంగా ఎంపీడీఓకు అందజేశారు. రాజీనామా విషయం కలెక్టర్ పరిశీలనలో ఉంది. ఒకసారి ఎన్నుకున్న ఉప సర్పంచ్‌ను వార్డు సభ్యులు వద్దనుకుంటే మార్చలేం. నిబంధన ప్రకారం రెండేళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టి మార్చవచ్చు.
–విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి
పల్లె పాలన పగ్గాలు
పల్లె పాలన పగ్గాలు


