నాణ్యమైన విత్తనాలతో దిగుబడి పెంచుకోవచ్చు
హుజూర్‌నగర్: నాణ్యమైన విత్తనాలు వాడటం వల్ల దిగుబడిని పెంచుకోవచ్చని ఏరువాక కేంద్రం నల్లగొండ జిల్లా శాస్త్రవేత్త రాజా మధుశేఖర్ అన్నారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హుజూర్‌నగర్‌లోని వ్యవసాయ కార్యాలయం వద్ద ఏఎంసీ చైర్‌పర్సన్ రాధికాఅరుణ్‌కుమార్ అధ్యక్షతన ‘నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజా మధుశేఖర్ పాల్గొని మాట్లాడుతూ.. విత్తనాల ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. నాణ్యమైన విత్తనాలు వాడితే పది నుంచి పదిహేను శాతం దిగుబడులు పెంచుకోవచ్చని ఆయన సూచించారు. అనంతరం రైతులకు విత్తన కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ రవి, ఏఓ స్వర్ణ, పీఏసీఎస్ చైర్మన్ జక్కుల నరేందర్ పాల్గొన్నారు.


