వ్యవసాయంలో ఆధునికతను జోడించాలి
కోదాడరూరల్ : వ్యవసాయంలో ఆధునికతను జోడించి రైతు సాధికారత సాధించడమే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత కృషి సంకల్ప అభియాన్ లక్ష్యమని భారత వరి పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ మానస తెలిపారు. శుక్రవారం కోదాడ మండల పరిధిలోని గణపవరం, చిమిర్యాలలో కేవీకే గడ్డిపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వానాకాలం సాగులో సుస్థిరమైన సాగు పద్ధతులు, శాసీ్త్రయతపై రైతులకు అవగాహన కలిగించారు. పంటల ఉత్పత్తి, నేల ఆరోగ్యం, వనరుల నిర్వహణ మెరుగుపరచడంపై రైతులు దృష్టి సారించాలన్నారు. భూసార పరీక్షల ఆధారంగా కావాల్సిన మోతాదులో మాత్రమే ఎరువులు, మందులను వినియోగించాలన్నారు. నేరుగా వరి విత్తనాలు విత్తే విధానంపై రైతులు అవగాహన పెంచుకొని తక్కువ శ్రమ, పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించాలని కోరారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు కిరణ్, ఎంఏఓ రజిని, ఏఈఓ ఝూన్సీ, మహేష్, డాక్టర్ కవిరాజు రైతులు సీతరాంరెడ్డి, సత్యనారాయణ, నరసింహరావు, నారపురెడ్డి, వెంకటేశ్వరరావు, గోపిరెడ్డి, రాములు, కన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


