రక్తం అందేలా.. ప్రాణాలు నిలిపేలా
భువనగిరి: జిల్లా కేంద్రం భువనగిరిలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు కానుంది. ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రక్తనిధి కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భవన నిర్మాణం కోసం అవసరమైన స్థలం కోసం సంస్థ సభ్యులు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
రూ. 5 నుంచి రూ.7 కోట్లతో నిర్మాణం
అధికారులు స్థలం కేటాయిస్తే బ్లడ్ బ్యాంక్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేందుకు రెడ్‌క్రాస్ సంస్థ సిద్ధంగా ఉంది. రూ.5 నుంచి రూ.7 కోట్ల అంచనా వ్యయంతో జీ ప్లస్ టూ భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో ల్యాబ్ ఏర్పాటుతో పాటు సిబ్బంది, ఐదు వాహనాలు, పరికరాలు, మిషన్లు, సాంకేతిక పరమైన వసతులు సమకూర్చనున్నారు. అలాగే రూ. 2 కోట్లతో తలసేమియా రోగుల కోసం ప్రత్యే వార్డు ఏర్పాటు చేయనున్నారు.
తొలగనున్న ఇబ్బందులు
హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న భువనగిరిలో బ్లడ్ బ్యాంకు లేదు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సరపడా రక్తనిల్వలు ఉండవు. అసరమైనప్పుడు రక్తం కోసం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా మీదుగా హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్ –విజయవాడ జాతీయ రహదారులు వెళ్తున్నాయి. వీటితో పాటు సిద్ధిపేట, మేదక్, జనగాం, మేడ్చల్, కరీంనగర్ వంటి జిల్లాకు వేళ్లే లింక్ రోడ్లు ఉన్నాయి. ఈ రహదారులపై నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల తీవ్రత అధికంగా ఉన్నప్పుడు రక్తం అవసరమైతే జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడం వల్ల హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు రెడ్ క్రాస్ సంస్థ సంకల్పించింది. అందబాటులోకి వస్తే రక్తనిధి సమస్య తొలగనుంది. రోడ్డు ప్రమాద క్షతగాత్రులతోపాటు తలసేమియా రోగులకు అవసరమైన రక్తం అందుబాటులో ఉండనుంది. బ్లడ్ బ్యాంకు నుంచి రక్తాన్ని ఉచితంగా అందజేయనున్నారు. బ్లడ్ బ్యాంకు నిర్మాణం జరిగితే వరంగల్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల ప్రజలుకు సైతం ఉపయోగంగా ఉంటుంది.
స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
అధునాత సౌకర్యాలతో బ్లడ్ బ్యాంక్ భవనాన్ని నిర్మించేందుకు రెడ్‌క్రాస్ జిల్లా శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం 1,500 నుంచి 2వేల గజాల వరకు స్థలం అవసరం అవుతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. రెడ్‌క్రాస్‌సంస్థ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి రెండు రోజుల క్రితం స్థలాన్ని పరిశీలించారు. ఇది ఫైనల్ కాని పక్షంలో బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని సంస్థ సభ్యులు కోరుతున్నారు.
భువనగిరిలో బ్లడ్ బ్యాంకుకు అనుమతి
ఫ రూ.7 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు
ఫ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో సన్నాహాలు
ఫ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్థలం గుర్తింపు
ఫ బస్టాండ్ సమీపంలోనూ పరిశీలించి ఫైనల్ చేయనున్న అధికారులు
సంవత్సరంలోగా పూర్తి
బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. దాతలు కూడా ముందుకు వస్తున్నారు. వారి సహకారంతో అధునాతన వసతులతో భువనం నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాం. భవన నిర్మాణం కోసం 1,500 నుంచి 2వేల గజాల వరకు స్థలం అవసరం ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న ప్రభుత్వం స్థలంలో లేదా బస్టాండ్‌కు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో గాని కేటాయించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు విజ్ఞప్తి చేశాం.
–దిడ్డి బాలాజీ, రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్
రక్తం అందేలా.. ప్రాణాలు నిలిపేలా
రక్తం అందేలా.. ప్రాణాలు నిలిపేలా


