ప్రజా వ్యతిరేక విధానాలపై తిరుగుబాటు తప్పదు
గట్టుప్పల్: ప్రజా వ్యతిరేక విధానాలు అవలబించే ప్రభుత్వాలపై తిరుగుబాటు తప్పదని సీపీఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. గట్టుప్పల్ మండల కేంద్రంలో బుధవారం జరిగిన అమరవీరుల సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెట్టుబడిదారులు, భూ స్వాములకు ప్రభుత్వాలు వత్తాసు పలుకుతు న్నాయన్నారు. కూలీలు, కార్మికుల హక్కుల కోసం ఎర్రజెండా అలుపులేకుండా పోరాడుతోందన్నారు. ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకూ ఎర్రజెండాను అంతం చేయడం ఎవ్వరి తరం కాదన్నారు. మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడతోందని విమర్శించారు. మే 1 నుంచి 8వ తేదీ వరకు కార్మిక వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలన్నారు. అంతకుముందు అమరవీరుల చిత్రపటాలకు పార్టీ నాయకులు కలిసి నివాళులు అర్పించారు. జాన్‌వెస్లీ రాక సందర్భంగా గట్టుప్పల్‌లో నిర్వహించిన ర్యాలీలో కళాకారుల ఆటాపాటలు ఆకట్టుకున్నాయి. ఆ పార్టీ మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, నాయకులు కట్ట నర్సింహ, సుర్కంటి శ్రీనివాస్‌రెడ్డి, బండ శ్రీశైలం, చాపల మారయ్య, శంకర్, నాంపల్లి చంద్రమౌళి, రవీందర్‌రెడ్డి, కర్నాటి సుధాకర్, పెద్దులు, దోనూరి నర్సిరెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టులతో చర్చలు జరపాలి
సంస్థాన్ నారాయణపురం: కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో వెంటనే శాంతియుతంగా చర్చలు జరపాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సంస్థాన్ నారాయణపురంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కర్రి గుట్టల్లో ఆదివాసీలను చుట్టుముట్టి చంపుతున్నారని, కర్రిగుట్టల్లో సహజ ఖనిజాలు పెద్ద ఎత్తున ఉన్నాయని, వాటిని ప్రైవేట్ వారికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే నివేదికను బహిర్గతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీల మీద పెట్టే శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంపై పెట్టాలన్నారు. ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఉన్నారు. అంతకుముందు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ


