ప్రశాంతంగా మోడల్ స్కూళ్ల పరీక్ష
భువనగిరి : మోడల్ స్కూళ్లలో 6,7,8,9,10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం అదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 973 మంది విద్యార్థులకు గాను 659 మంది హాజరయ్యారు. 314 మంది గైర్హాజరైనట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు.
వేసవి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
సంస్థాన్‌నారాయణపురం : జిల్లా యువజన, క్రీడల శాఖ, సంస్థాన్‌నారాయణపురం స్పోర్ట్స్ క్లబ్ సంయుక్తంగా ఇచ్చే వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొవాలని క్లబ్ వ్యవస్థాపక ఆధ్యక్షుడు సిలివేరు సైదులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాలీ బాల్, యోగా, తైక్వాండ్‌లో మే 1వ తేదీనుంచి సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్ల లోపు బాల, బాలికలు శిక్షణకు అర్హులన్నారు. జూన్ 6వ తేదీ వరకు శిక్షణ శిబిరం కొనసాగుతుందన్నారు.
యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు. ఆ తరువాత గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
తుర్కపల్లి : రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని అదనపు కలెక్టర్ (రెవె న్యూ) వీరారెడ్డి సూచించారు. తుర్కపల్లి మండలం పెద్దతండా, మాదాపురం, పల్లెపహాడ్‌లో కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు.
బీసీ గురుకుల కాలేజీల్లో అడ్మిషన్లు
భువనగిరి : జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల(బాలురు) డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జెల్ల స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్‌సీఎస్, బీజెడ్‌సీ, బీకాం సీఏ, బీఏ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు ఆన్‌లైన్, మీసేవ కేంద్రాల ద్వారా రూ.200 ఫీజు చెల్లించి మే5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


