అర్హులకే ఇళు్ల వచ్చేలా..
ఇంటింటి సర్వే ప్రారంభించిన అధికారులు
సాక్షి, యాదాద్రి : నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల ఎంపికకు చేపట్టిన సర్వేను వేగవంతం చేసింది. అయితే ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా ఇందులో 17 గ్రామాలను ఎంపిక చేసి 724 ఇళ్లను ఇప్పటికే మంజూరు చేసింది. గ్రామాల్లో మిగతా ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈనె 22 నుంచి గెజిటెడ్ అధికారులతో మున్సిపాలిటీలు, గ్రామాల వారీగా దరఖాస్తుదారుల ఇళ్లలో విచారణ (సర్వే) ప్రారంభించింది. ఈ సర్వే ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే మున్సిపాలిటీలు, గ్రామాల్లోని ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారుల జాబితాలను జిల్లా కలెక్టర్‌కు అందజేయగా అత్యంత నిరుపేదలకు ముందుగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు.
ఒక్కో గ్రామానికి ఐదుగురు అధికారులు
ఒక్కో గెజిటెడ్ అధికారికి 200 ఇళ్ల విచారణ బాధ్యతలు అప్పగించారు. ఎల్–1, ఎల్–2, ఎల్–3 జాబితాల ఆధారంగా ఒక్కో గ్రామానికి నలుగురు నుంచి ఐదుగురు అధికారులను నియమించారు. ఇందులో ఎంపీడీఓలు, ఎంపీఓలు, పీఆర్ జేఈలు, ఏఓలు, మున్సిపల్ అధికారులు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు 200 ఇళ్ల పరిశీలన చేస్తున్నారు. గుడిసెలు, ఇంటిపై టార్పాలిన్ కవర్లు కప్పుకున్న వారు, పెంకుటిల్లు ఉన్నవారు, కిరాయికి ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అనంతరం అర్హుల జాబితాలను పంచాయతీ, మున్సిపాలిటీల నోటీస్ బోర్డుల్లో అతికిస్తారు. అనంతరం కలెక్టర్‌కు అందజేస్తారు.
మే మొదటి వారంలో లబ్ధిదారుల జాబితా
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మే మొదటి వారంలో ఇళ్లు మంజూరు కానున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన జాబితాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. అధికారులు సర్వే అధారంగా ఇచ్చిన జాబితాలను కలెక్టర్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రికి సమర్పించి ఆయన నుంచి మంజూరు తీసుకుంటారు. అనంతరం ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తారు.
ఇవీ అనర్హతలు..
ఫ ఆర్‌సీసీ ఇల్లు ఉన్న వారికి ఇవ్వరు.
ఫ రెండున్నర ఎకరాల కంటే ఎక్కువ సాగు భూమి, లేదా 5 ఎకరాల నీటిపారుదల లేని భూమి ఉండొద్దు.
ఫ నాలుగు చక్రాల వాహనం, వ్యవసాయ అనుబంధ 3బై4 చక్రాల వాహనం ఉండొద్దు.
ఫ రూ.50 వేల కంటే ఎక్కువ కిసాన్ క్రెడిట్ కార్డు పరపతి ఉండొద్దు.
ఫ ఇన్‌కం టాక్స్ చెల్లించే వారు అనర్హులు.
ఫ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి,
పిల్లల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి
అయి ఉండకూడదు.
ఫ ఇప్పటికే ఇళ్ల నిర్మాణం ప్రారంభించి
ఉండకూడదు.
ఫ ప్రస్తుతం ఉన్న ఇంటికి అనుబంధంగా మరో నిర్మాణం, లేదా ఉమ్మడిగా ఇంటి నిర్మాణం చేసే వారికి పథకం వర్తించదు.
ఫ ఒక్కో అధికారికి
200 ఇళ్లు కేటాయింపు
ఫ పక్కాగా నిబంధనల అమలుపై దృష్టి
ఫ అత్యంత నిరుపేదలకు
మొదటి ప్రాధాన్యం
ఫ నెలాఖరు వరకు పూర్తికానున్న సర్వే
నిబంధనలు ఇలా..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం లబ్ధిదారు ఉంటున్న ఇంటి పైకప్పు, గోడల రకం, కచ్చా లేదా పక్కా నిర్మాణమా చూపాలి. లబ్ధిదారు ఉంటున్న ఇల్లు అద్దె లేదా సొంతమా.. ఇంటి నిర్మాణ స్థలం ఉంటే దానిరకం (పట్టా, రిజిస్టర్ డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్ పుస్తకం, స్థలం పంచుకుంటే దానికి సంబంధించిన రుజువులు) ఉండాలి. ఇంటి స్థలం 60 గజాల కంటే ఎక్కువ ఉందా.. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.15 వేలు, మున్సిపాలిటీల్లో నెలకు రూ.25 వేల కంటే తక్కువగా ఆదాయం ఉండాలి. లబ్ధిదారు గ్రామంలో కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండాలి. మున్సిపాలిటీలో ఐదేళ్లకు మించి నివాసముండాలి. 400 నుంచి 600 చదరపు అడుగుల్లో రెండు గదులు, ప్రత్యేకంగా వంట గది, టాయిలెట్‌తో ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంది.


