తమ్ముడి మృతి తట్టుకోలేక అన్న ఆత్మహత్య
భువనగిరిటౌన్, భూదాన్‌పోచంపల్లి: తమ్ముడు మృతి తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన అన్న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భువనగిరి మండలం తుక్కాపూర్‌లోని ఓ వెంచర్‌లో మంగళవారం రాత్రి జరిగింది. వివరాలు.. భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దరావులపల్లికి చెందిన పర్వతం ఆంజనేయులు, అండాలు దంపతులకు ఇద్దరు కుమారులు కిరణ్‌కుమార్(25), సాయితో పాటు ఒక కుమార్తె ఉన్నారు. వీరి కుటుంబం పదేళ్ల క్రితం ఆలేరుకు వలస వెళ్లి అక్కడ పాత ఇనుప సామాను వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే చిన్న కుమారుడు సాయి మూడు నెలల క్రితం ఉరేసుకుని బలవర్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబం అక్కడ నుంచి భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లికి వచ్చి ఉంటున్నారు. తమ్ముడి మృతి తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన కిరణ్‌కుమార్ తనకు బతకడం ఇష్టంలేదని తాను చనిపోతానంటూ తరచూ తల్లికి చెప్పేవాడు. కాగా మంగళవారం రాత్రి కిరణ్‌కుమార్ తనకు పని ఉందని ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తన సోదరికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. అనంతరం భువనగిరి మండలం తుక్కాపూర్‌లోని ఓ వెంచర్‌లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం కిరణ్‌కుమార్ మృతదేహాన్ని పెద్దరావులపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.


