
పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
భువనగిరి టౌన్ : మహాత్మ జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, కుల సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. పూలే జయంతి ఉత్సవాల నిర్వహణపై సలహాలు, సూచనలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరిలోని పూలే విగ్రహం వద్ద పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, రంగులతో తీర్చిదిద్దాలని ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, బీసీ సంక్షేమ అధికారి యాదయ్య, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అభివృద్ధి అధికారి వసంత కుమారి, భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామలింగం తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యకరమైనసమాజాన్ని నిర్మిద్దాం
భువనగిరి టౌన్ : ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ మనోహర్ కోరారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం భువనగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే డబ్బు పొదుపు చేసినట్టేనని, ప్రపచంలో అసలైన కుభేరులు ఆరోగ్యవంతులేనని పేర్కొన్నారు. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు సమష్టి కృషి అవసరం అన్నారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాతాశిశు సంరక్షణ అధికారి డాక్టర్ యశోద, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శిల్పిని, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.
గ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డు ప్రదానం
భూదాన్‌పోచంపల్లి : పట్టణంలోని అభినవ యూత్ అసోషియేషన్ సామాజిక సేవలను గుర్తించి హైదరాబాద్‌లోని ఫెడరల్ రీసెర్చ్ అండ్ రికగ్‌నైజేషన్ కౌన్సిల్ సంస్థ గ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డు–2025 ప్రదానం చేసింది. గచ్చిబౌలి లోని మెరిడియన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా యూత్ అధ్యక్షుడు జోగు రవీందర్ అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు. సామాజిక సేవ, గ్రామ అభివృద్ధే లక్ష్యంగా 2018లో అభినవ యూత్ ఏర్పాటు చేశామని యూత్ అధ్యక్షుడు జోగు రవీందర్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు.
శివుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి కొండపై ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన తదితర పూజలు నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలకు నిజాభిషేకం, అర్చనతో కొలిచారు. అనంతరం శ్రీసుదర్శన హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర పూజలు నిర్వహించారు.

పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి