సబ్‌జైలును సందర్శించిన డీఐజీ | - | Sakshi
Sakshi News home page

సబ్‌జైలును సందర్శించిన డీఐజీ

Mar 14 2025 1:05 AM | Updated on Mar 14 2025 1:04 AM

భువనగిరిటౌన్‌ : జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్‌ గురువారం భువనగిరిలోని సబ్‌ జైలును సందర్శించారు. ఖైదీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. భోజనం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. వంటలు రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకువచ్చేందుకు ప్రభుత్వం వివిధ రకాల పథకాలు తీసుకువస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంతోమంది క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారని, అటువంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు రికార్డులను పరి శీలించారు. ఆయన వెంట సబ్‌జైలర్‌ నెహ్రూ ఉన్నారు.

గ్రూప్‌–2 ర్యాంకర్‌కు కలెక్టర్‌ అభినందన

మోత్కూరు : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రూపు–2 ఫలితాల్లో మోత్కూరుకు చెందిన గుర్రం సాయికృష్ణారెడ్డి రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకు సాధించారు. గురువారం కలెక్టర్‌ను కలువగా అభినందించి శాలువాతో సత్కరించారు. సాయికృష్ణారెడ్డి గ్రూపు–4లో జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు సాధించి ప్రస్తుతం కలెక్టరేట్‌లోని రెవెన్యూ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. సాయికృష్ణారెడ్డిని అభినందించిన వారిలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఏఓ జగన్‌, ఉపాధిహామీ పథకం అంబుడ్స్‌మెన్‌ మందడి ఉపేందర్‌రెడ్డి ఉన్నారు.

ఇంటర్‌ పరీక్షలకు 5,467 మంది హాజరు

భువనగిరి : ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం జరిగి న ప్రథమ సంవత్సరం గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షలకు 5,777 మంది విద్యార్థులకు గాను 5,467 మంది హాజరయ్యారు. 310 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు.

ఫిజియోథెరపిస్టుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

భువనగిరి : అడ్డగూడూరు, బొమ్మలరామారం, తుర్కపల్లి, మోటకొండూరు, రామన్నపేట, వలిగొండలోని భవిత కేంద్రాల్లో విద్యార్థులకు ఫిజియోథెరపీ సేవలు అందించడానికి అర్హత కలిగిన ఫిజియెథెరపిస్టుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 17 సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు.

బీబీనగర్‌ కానిస్టేబుల్‌కు ఉమెన్‌ లెజెండ్‌ అవార్డు

బీబీనగర్‌ : బీబీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న వై.అరుణ సూపర్‌ ఉమెన్‌ లెజెండ్‌ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శ్రీకొమ్మూరి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు అవార్డు ప్రదానం చేశారు.

టెన్త్‌ ప్రశ్న పత్రాలు వచ్చాయ్‌

భువనగిరిటౌన్‌ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్న పత్రాలు గురువారం జిల్లా కేంద్రానికి చేరాయి. కార్గో బస్సులో కలెక్టరేట్‌కు వచ్చిన ప్రశ్నపత్రాలను అధికారులు పరిశీలించి గదిలో భద్రపరిచి సీల్‌ వేశారు. శుక్రవారం (నేడు) అన్ని మండల కేంద్రాల్లోని పోలీస్‌ స్టేషన్లకు బందోబస్తు మధ్య ప్రశ్నపత్రాలను పంపనున్నారు. పరీక్ష ప్రారంభం కావడానికి కొద్ది సమయం ముందు ప్రశ్న పత్రాలను పోలీస్‌ స్టేషన్‌ నుంచి పరీక్ష కేంద్రాలకు తరలిస్తారు.

సబ్‌జైలును సందర్శించిన డీఐజీ  1
1/1

సబ్‌జైలును సందర్శించిన డీఐజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement