విద్యాభివృద్ధికి అబ్దుల్ ఖాదిర్ సేవలు అభినందనీయం
కోదాడరూరల్ : పేదపిల్లల విద్యాభివృద్ధికి మదర్సాను స్థాపించి మౌలానా అబ్దుల్ ఖాదిర్ చేస్తున్న సేవలు అభినందనీయమని జమీయత్ ఉలేమా ఏ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఎహెసానుద్దీన్, ప్రధాన కార్యదర్శి నబీర్ సాహెబ్ అన్నారు. ఆదివారం కోదాడ మండలం దుర్గాపురం క్రాస్‌రోడ్‌లోని మదర్సాలో ఏర్పాటు చేసిన అభినందన సభలో వారు మాట్లాడారు. యాభై ఏళ్లుగా వేలాది మంది పిల్లలకు ఉచిత వసతితో పాటు ఆధ్యాత్మిక, సాధారణ విద్యను అందిస్తూ వారిని ప్రయోజకులను చేయడం గొప్ప విషయమన్నారు. ఆర్గనైజర్ మదీనా మోడల్ స్కూల్ చైర్మన్ మౌలానా అహ్మద్ నద్వీ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైతిక విలువలు, ఆధ్యాత్మిక జిజ్ఞాస పెంపొందించడమే మదర్సా లక్ష్యమన్నారు. పూర్వ విద్యార్థులు గురువు అబ్దుల్ ఖాదిర్‌కు కారును బహూకరించారు. ఆర్గనైజర్ మౌలానా అహ్మద్ నద్వీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మౌలానా అత్తహర్, మీరాజుద్దీన్, హామీద్‌సాబ్, హాఫీజ్ పాల్గొన్నారు.


