తండ్రికి నెల మాసికం పెడుతూ కుమారుడు మృతి
ఆత్మకూరు.ఎస్(సూర్యాపేట): నెల రోజుల క్రితం తండ్రి మృతిచెందగా నెల మాసికం పెడుతూ ప్రమాదవశాత్తు కోనేరులో జారిపడి యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని పాత సూర్యాపేట గ్రామంలో గురువారం జరిగింది. నెల రోజుల వ్యవధిలో తండ్రి, కుమారుడు మృతిచెందడంతో ఆ కుటుంబం దుఖఃసాగరంలో మునిగింది. పాత సూర్యాపేట గ్రామానికి చెందిన పోలోజు రుక్మాచారి అనారోగ్యంతో నెల రోజుల క్రితం మృతిచెందాడు. రుక్మాచారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు మహేష్ చారి (22) ఉన్నారు. మహేష్‌చారి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి రుక్మాచారి మృతిచెందడంతో మహేష్ నెల రోజులుగా గ్రామంలోనే తల్లి విజయలక్ష్మితో కలిసి ఉంటున్నాడు. గురువారం తండ్రికి నెల మాసికం పెట్టడం కోసం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి అందరూ పాత సూర్యాపేట గ్రామం సమీపంలోని చక్రయగుట్ట వద్దకు వెళ్లారు. తండ్రికి పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించిన అనంతరం స్నానం చేయడానికి మహేష్‌చారి గుట్టపై గల కోనేటిలోకి బంధువులతో కలిసి వెళ్లాడు. ఈ సమయంలో కాలుజారి మహేష్ చారి కోనేటిలో పడిపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. బంధువులు వెంటనే అందులోకి దూకి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. గ్రామస్తులు వచ్చి కోనేరులో వెతికి మహేష్‌చారి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లి పోలోజు విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ శంకర్‌నాయక్ తెలిపారు.
ఫ పిండప్రదానం అనంతరం కోనేరులో స్నానానికి వెళ్లి నీటమునిగిన యువకుడు


