‘దారి’చూపు నారసింహా..
తుర్కపల్లి: యాదగిరిగుట్ట – కొండాపూర్ రహదారి విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. 18 నెలల్లో పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా ఐదేళ్లు కావస్తున్నా పూర్తవలేదు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా నలుదిశలా ఉన్న రహదారులను విస్తరించాలని అప్పటి ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో యాదగిరిగుట్ట నుంచి తుర్కపల్లి, వెంకటాపురం మీదుగా కొండాపూర్ వరకు ఇరువైపులా కలిపి 100 మీటర్ల (ఫోర్‌లైన్) వెడల్పుతో విస్తరణ పనులు ప్రారంభించారు. అయితే ఇంకా పది శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
రెండు బిడ్‌లుగా విభజన
రోడ్డు విస్తరణ పనులను రెండు బిడ్‌లుగా విభజించారు. తుర్కపల్లి నుంచి యాదగిరిగుట్ట వరకు 15.4 కిలో మీటర్లు, తుర్కపల్లి మండలం వాసాలమర్రి నుంచి కొండాపూర్ వరకు 4.6 కిలో మీటర్లు విస్తరించాల్సి ఉంది. ఇందుకోసం గత ప్రభుత్వం సుమారు రూ.80 కోట్లు మంజూరు చేసింది. సిఫై సంస్థ పనులు దక్కించుకోగా.. 2020లో శంకుస్థాపన జరిగింది. తుర్కపల్లి, వెంకటాపురం, మల్లాపురం పరిధిలో పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇక్కడ ఒక వైపు మాత్రమే పూర్తి కాగా మరోవైపు పెండింగ్ ఉన్నాయి. దీంతో వాహనాలు సింగిల్ వేలో ప్రయాణిస్తున్నాయి.
రోడ్డు ప్రత్యేకత ఇదీ..
యాదగిరిగుట్ట–కొండపూర్ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తే భక్తులు యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరుకోవడానికి సులువుగా, సౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మార్గం గజ్వేల్‌తో పాటు వివిధ ప్రధాన ప్రాంతాలకకు వెళ్లడానికి అనువైన మార్గం. ఇది రాష్ట్రీయ రహదారి. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. విస్తరణ పనులు అసంపూర్తిగా ఉన్న చోట వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
నిర్వాసితులకు అందని పరిహారం
రోడ్లు విస్తరణలో భాగంగా వెంకటాపురంలో పలుపురి ఇళ్లను అధికారులు కూల్చివేశారు. వారికి నేటికీ పరిహారం చెల్లించలేదు. పనులు నిలిచిపోవడం వల్ల రోడ్డు సైడ్ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
గుట్ట – కొండాపూర్ రోడ్డు పనులకు వీడని గ్రహణం
భక్తుల సౌకర్యార్థం నాలుగు లేన్లుగా రహదారి విస్తరణ
ఐదేళ్లు కావస్తున్నా అసంపూర్తిగానే..
ఇబ్బంది పడుతున్న వాహనదారులు
నిర్వాసితులకు పరిహారం
చెల్లింపులోనూ జాప్యం


