నమ్మకం కోల్పోతున్న ప్రజలు
సమన్వయంతో ఉమ్మడి నివేదికలు
కొల్లేరు ప్రజలకు న్యాయం చేయండి
కై కలూరు: కొల్లేరు అభయారణ్య సమస్య మరోసారి తీవ్రరూపం దాల్చింది. పర్యావరణ ప్రేమికుల ఫిర్యాదుల నేపథ్యంలో సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారిత కమిటీ (సీఈసీ) ఇటీవల కొల్లేరులో ఆక్రమిత చెరువులు, హద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అటవీ, రెవెన్యూ, డ్రెయినేజీ శాఖల నుంచి వివరాలు సేకరించినప్పటికీ, పూర్తి స్థాయి సమాచారం అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబరు 27న ఏలూరు కలెక్టరేట్‌లో పర్యావరణ, అటవీశాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి కాంతిలాల్ దండే జిల్లా కలెక్టర్, అటవీశాఖ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన ఆదేశాలతో ప్రస్తుతం దస్త్రాల సేకరణ ప్రక్రియ వేగవంతమైంది.
భూముల విస్తీర్ణం – ప్రభుత్వ ప్రతిపాదనలు
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని కై కలూరు, ఉంగుటూరు, దెందులూరు, ఉండి, ఏలూరు నియోజకవర్గాల్లోని 9 మండలాల్లో 77,138 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. మొత్తం 122 గ్రామాలు దీని పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. అభయారణ్యంలో 14,932 ఎకరాల జిరాయితీ భూములు, 5,510 ఎకరాల డీ–పట్టా భూములు కలిపి మొత్తం 20,442 ఎకరాలు ఉన్నాయి. వీటిని అభయారణ్య పరిధి నుంచి మినహాయించాలని ప్రభుత్వం ఇప్పటికే సీఈసీకి నివేదిక సమర్పించింది. అయితే, సరిహద్దులకు సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టంగా లేకపోవడంతో ఆ నివేదికను సీఈసీ తిరిగి పంపింది. అక్టోబర్ 5వ తేదీలోపు సమగ్ర నివేదికను అందజేయాలని స్పష్టం చేయడంతో, అటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా తుది నివేదిక రూపకల్పనలో నిమగ్నమయ్యాయి.
చిత్తడి నేలల చట్టం నీడలో స్థానికులు
కొల్లేరు అభయారణ్య సరిహద్దులకు సమీపంలో 10 కిలోమీటర్ల మేర రక్షణ వలయంగా గుర్తించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలైతే ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని 13 మండలాలు, 6 నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాల పరిధిలో లక్షలాది ఎకరాల భూముల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ‘వాయిస్ ఆఫ్ కొల్లేరు’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థ న్యాయపోరాటానికి సిద్ధమవుతుండటం గమనార్హం.
కొల్లేరు నివేదికపై ఏలూరు కలెక్టరేట్‌లో సీఎస్ కాంతిలాల్ దండే సమావేశం (పైల్) కొల్లేరు ప్రాంతం
ఎన్నికల సమయంలో కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో అక్రమ చెరువుల తొలగింపు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు కఠినంగా ఉండటం, అధికారుల నివేదికలపై పర్యావరణవేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
కేంద్రం సాధికారిత కమిటీ(సీఈసీ)కి కొల్లేరు అంశంపై ఇప్పటికే నివేదిక చేరింది. ఇందులో 10 శాతం కొన్ని సమస్యల వల్ల తిరిగి మార్పులతో నివేదిక పంపుతున్నాం. అటవీ, రెవెన్యూశాఖల సమన్వయంతో తుది నివేదిక తయారవుతోంది. ఉన్నతాధికారులు నివేదికపై ప్రత్యేక దృష్టి సారించాలి.
– కె.రామలింగాచార్యులు, అటవీశాఖ రేంజర్, కై కలూరు
ఎన్నికల సమయంలో కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి. గ్రామాల్లో అనేక మంది ఉపాధి పనులు లభించక వలసబాట పడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించాలి. ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా అటవీ చట్టాలలో మార్పు రావాలి.
– జయమంగళ కాసులు, మాజీ సర్పంచ్, పెంచికలమర్రు
సీఈసీ నివేదిక నిమిత్తం ఈ నెల 5న డెడ్‌లైన్
అటవీ, రెవెన్యూ శాఖలకు పీఎస్ కాంతిలాల్ దండే సూచనలు
సానుకూల నిర్ణయంపై కొల్లేరు ప్రజల ఎదురుచూపులు


