పుర ఎన్నికలు షురూ | - | Sakshi
Sakshi News home page

పుర ఎన్నికలు షురూ

Oct 2 2026 7:38 AM | Updated on Oct 2 2026 7:38 AM

సాక్షి, భీమవరం: జిల్లాలో ప్రత్యేక పాలనలో ఉన్న నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. పంచాయతీల విలీనానికి వ్యతిరేకంగా దాఖలైన కేసులను కొట్టివేస్తూ గురువారం హైకోర్టు తీర్పునిచ్చింది. ఎన్నికల ప్రక్రియ మొదలైతే ఓటర్లు, వార్డుల విభజనకు దాదాపు నెలన్నర రోజులు సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో నరసాపురం, ఆకివీడులో తొలి విడతలోను, మిగిలిన వాటికి మలి విడతలో ఎన్నికలు జరగవచ్చని తెలుస్తోంది.

ఏడేళ్లుగా ప్రత్యేక పాలనలో..

జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం మున్సిపాల్టీలు, ఆకివీడు నగర పంచాయతీ ఉన్నాయి. 2014లో మున్సిపల్‌ ఎన్నికలు జరగ్గా 2019తో పదవీ కాలం ముగిసింది. కోవిడ్‌ నేపధ్యంలో రెండేళ్లు ప్రత్యేక పాలన సాగింది. భీమవరం సమీపంలోని తాడేరు, రాయలం, చినఅమిరం, నరసింహపురం, కొవ్వాడ అన్నవరం గ్రామాలు, తణుకులో వెంకటరాయపురం, పైడిపర్రు, వీరభద్రపురం గ్రామాలు, పాలకొల్లులో దిగమర్రు, వరిధనం, కొంతేరు, భగ్గేశ్వరం, పూలపల్లి, యాళ్లవానిగరువు, ఉల్లంపర్రు, అడివిపాలెం గ్రామాలు, తాడేపల్లిగూడెంలో పడాల, కుంచనపల్లి, ఎల్‌ అగ్రహారం, కుండ్రుప్రోలు, ప్రత్తిపాడు గ్రామాలను విలీనం చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆయా గ్రామాల ప్రజలు కోర్టులను ఆశ్రయించారు. విలీన సమస్యలు లేకపోవడంతో నరసాపురం, ఆకివీడులో 2021లో ఎన్నికలు జరగ్గా, మిగిలిన నాలుగు మున్సిపాల్టీలు ఏడేళ్లుగా ప్రత్యేక పాలనలోనే ఉండిపోయాయి.

రెండో విడతలోనేనా?

విలీన పంచాయతీలకు సంబంధించిన మున్సిపాల్టీల్లో ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో నరసాపురం, ఆకివీడులో మాత్రమే వార్డులు, సామాజికవర్గాల వారీగా ఓటర్లు విభజన, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లులో ఎలాంటి కసరత్తు మొదలు కాలేదు. కోర్టు తీర్పు ఉత్తర్వులు ప్రభుత్వానికి చేరి, వాటిపై ప్రభుత్వం కసరత్తు చేసి ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టేందుకు వారం పది రోజుల సమయం పడుతుంది. వార్డులు పునర్విభజన, ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా విడుదల, అదే తరహాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ ఓటర్లు విభజన, పోలింగ్‌ కేంద్రాలు తదితర వాటికోసం దాదాపు నెలన్నర రోజుల సమయం పడుతుంది. అయితే ఆరు వారాల్లోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో ఎన్నికల కసరత్తు పూర్తిచేసిన నరసాపురం, ఆకివీడులో తొలి విడతలోను మిగిలిన నాలుగు మున్సిపాల్టీలకు రెండో విడతలోను ఎన్నికలు జరుగవచ్చునంటున్నారు.

పెరగనున్న వార్డులు

నాలుగు పట్టణాల్లో వార్డుల సంఖ్య పెరుగనుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల మేరకు భీమవరంలో 39 వార్డులు 52కు, తణుకులో 34 నుంచి 48 వార్డులకు, తాడేపల్లిగూడెంలో 32 నుంచి 48 వార్డులకు, పాలకొల్లులో 31 నుంచి 48 వార్డులకు పెరగవచ్చునని అంచనా. కొత్త వార్డులకు హద్దులు నిర్ణయించాక ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ, రిజర్వేషన్ల ఖరారు వంటి ప్రక్రియలు చేయాల్సి ఉంది. జనాభా ఆధారంగా ఎన్ని వార్డులు పెరుగుతాయి?, ఏ ప్రాంతం ఏ వార్డులోకి వస్తుంది? రిజర్వేషన్లు ?, గెలుపు అవకాశాలపై ఆశావాహులు ఎవరి లెక్కల్లో వాళ్లు ఉన్నారు.

హైకోర్టు తీర్పుతో తొలగిన విలీన అడ్డంకులు

భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లులో లైన్‌ క్లియర్‌

ఏడేళ్లుగా ప్రత్యేక పాలనలోనే ఆయా పట్టణాలు

ఓటర్లు, వార్డుల విభజనకు నెలన్నర సమయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement