ఉండి: మధ్యంతర భృతిని 30 శాతం ప్రకటించాలని ఎస్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ లంకలపల్లి సాయిశ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని హైస్కూళ్లు, కళాశాలలను సందర్శించారు. ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీని నియమించిదని, అయినా మధ్యంతర భృతి ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కోరారు. పెండింగ్ బకాయిల చెల్లింపునకు రోడ్డు మ్యాప్ విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు కోసం సత్వరమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేస్తూ ఉత్తర్వులను విడుదల చేయాల్సి ఉందన్నారు. మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సత్యం, కె.సురేష్‌కుమార్ తదితరులు ఉన్నారు.
భీమవరం: సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ అర్హులకు ప్రయోనం అందించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్ష మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జలజీవన్ మిషన్, పల్లె పండుగ పనుల ప్రగతిని సమీక్షించారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గోదావరి డెల్టా ఆధునికీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని వివరించారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
2.19 లక్షల మందికి పింఛన్లు
భీమవరం 8వ వార్డు కంకరదొడ్డి చినరంగనిపాలెం వద్ద పేదల సేవలో 2.0 గ్రామ సభలో మంత్రి రవికుమార్ పాల్గొన్నారు. ముందుగా వార్డులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 2.19 లక్షల మందికి రూ.95 కోట్ల మేర పింఛన్లు అందిస్తున్నామన్నారు. అలాగే 45 వేల పింఛన్ దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, ప్రభుత్వానికి పంపామన్నారు. కలెక్టర్ నాగరాణి తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా డాక్టర్ బి.ప్రసన్నకుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎం.మాధవి ఆర్జిత సెలవుపై వెళ్లడంతో డీన్ ఆఫ్ హార్టీకల్చర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రసన్నకుమార్ కు రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన మాట్లాడుతూ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల ప్రవేశాలు ఆన్‌లైన్ పద్ధతిలో జరుగుతున్నాయన్నారు. అలాట్‌మెంట్ లేఖలు అందిన డిగ్రీ విద్యార్థులు ఈనెల 3లోపు కాలేజీల్లో చేరాలన్నారు. పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం శుక్రవారంలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, వారికి ఈనెల 5న అలాట్‌మెంట్ లేఖలు వెళతాయన్నారు.
తణుకు అర్బన్: ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి చిత్ర కళా పోటీల్లో తణుకుకు చెందిన చి త్రకారుడు డాక్టర్ వెంపటాపు ప్రథమ బ హుమతి అందుకున్నారు. గతనెల 30న ఒంగోలు జరిగిన ఒంగోలు 150 వసంతాల ఉత్స వ కార్యక్రమంలో ఒంగోలు వైభవ ప్రకాశం–ప్రభంజనం శీర్షికతో రూపొందించిన కళాఖండానికి బహుమతి లభించింది. రూ.20 వేల నగదు ప్రోత్సాహకం, జ్ఞాపిక అందుకున్నట్టు వెంపటాపు తెలిపారు.


