భాద్రపదం.. పితృదేవతలకు ప్రీతికరం | - | Sakshi
Sakshi News home page

భాద్రపదం.. పితృదేవతలకు ప్రీతికరం

Sep 11 2026 11:03 AM | Updated on Sep 11 2026 11:03 AM

భాద్రపదం.. పితృదేవతలకు ప్రీతికరం పితృదేవతల రుణం తీర్చుకునే అవకాశం

రేపటి నుంచి భాద్రపదం ప్రారంభం

వినాయక చవితి తరువాత పితృదేవతల ఆరాధనకు ప్రాధాన్యం

ద్వారకాతిరుమల: సకల శుభాలు, సుముహూర్తాలను అందించిన శ్రావణ మాసం శుక్రవారంతో ముగియనుంది. శనివారం నుంచి భాద్రపద మాసం ప్రారంభం కానుంది. సనాతన హైందవ సంప్రదాయంలో ప్రతి మాసానికీ ఓ ప్రత్యేకత ఉన్నట్టే.. భాద్రపదానికి ఉంది. ముఖ్యంగా పితృదేవతల ఆరాధనకు ఈ మాసం విశిష్టమైనదని పండితులు చెబుతున్నారు. ఆధ్యాత్మిక చింతన, దానధర్మాలు, పితృకార్యాలకు అనువైన మాసంగా పేర్కొంటున్నారు. భాద్రపదంలో వినాయక చవితి ప్రధాన పర్వదినంగా నిలుస్తోంది. ఈ నెల 14న వినాయకచవితి పండుగను నిర్వహిస్తారు. ఆ తర్వాత పలు పండుగలు, వ్రతాలు, జయంతులు వరుసగా రానున్నాయి. ముఖ్యంగా మహాలయ పక్షాల్లో పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.

పండుగలు.. వ్రతాలతో భక్తిభావం

శుభకార్యాలకు కొంత విరామం ఉన్నా.. భాద్రపదంలో వచ్చే పండుగలు, వ్రతాలు భక్తిభావాన్ని పెంపొందిస్తాయి. ఏ కార్యం తలపెట్టినా ముందుగా విఘ్నాధిపతి గణపతిని స్మరించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఈ నెల 14న వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. 15న రుషి పంచమి, 19న రాధాష్టమి, 23న వామన జయంతి, 25న అనంత పద్మనాభ వ్రతం, 26న భాద్రపద పౌర్ణమి రానున్నాయి. పౌర్ణమి అనంతరం పితృపక్షాలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, అన్నదానాలు నిర్వహిస్తారు. అక్టోబర్‌ 10న సర్వపితృ అమావాస్యతో ఈ పర్వకాలం ముగియనుంది.

జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చలేనిది. వారి పేరిట దానధర్మాలు, అన్నదానాలు చేయడం, తర్పణాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పితృదేవతల అనుగ్రహం పొందవచ్చని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మహాలయ పక్షాల్లో శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ద్వారా పూర్వీకులకు శాంతి చేకూరుతుందని విశ్వాసం. –సేనాపతి మోహన మురళీకృష్ణ,

వేద పండితుడు, శ్రీవారి దేవస్థానం, ద్వారకాతిరుమల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement