పోలవరం రూరల్: వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలవరం డీఎస్పీ కె. జయకృష్ణ సూచించారు. పోలవరంలో నిర్వహించిన గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్‌లైన్ ద్వారా తప్పనిసరిగా అనుమతి పొందాలని, భద్రత కోసం ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఊరేగింపుల్లో డీజేలు, అధిక శబ్దాలు, అశ్లీల నృత్యాలు లేదా రెచ్చగొట్టే నినాదాలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే ఉపయోగించాలని, నిమజ్జన వేడుకల్లో మద్యం సేవించిన వారిని దూరంగా ఉంచాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలంతా పోలీసు శాఖకు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఆగిరిపల్లి: శోభనాపురం గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఎస్సై హనుమంత్ నాగరాజు తన సిబ్బందితో కలిసి దాడి చేసి 8మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.11,600 నగదు, 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కొయ్యలగూడెం: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందిన ఘటన దిప్పకాయలపాడు తూర్పు కాల్వ వంతెనపై మంగళవారం ఉదయం సంభవించింది. దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన ఆసుబోయిన వెంకటేశ్ (75) ఉపాధి హామీ కూలీగా పనిచేస్తున్నారు. బిల్లిమిల్లి సమీపంలో నిర్వహిస్తున్న ఉపాధి పనులకు హాజరు కావడానికి సైకిల్‌పై వెళుతుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. ఈ ఘటనపై ఎస్సై వి.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో వ్యక్తికి స్వల్ప గాయాలు
కోనేరుసెంటర్: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటనపై బందరు రూరల్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. భీమవరానికి చెందిన పోతూరి గంగరాజు బందరు మండలం రుద్రవరంలోని 40 ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన మంగళవారం చేపలు పట్టేందుకు భీమవరం నుంచి సుమారు 40 మంది కూలీలను రప్పించారు. తెల్లవారుజామున మూడు కంటైనర్లలో రుద్రవరం చేరుకున్న కూలీలు.. రెండు కంటైనర్లలో చేపలు పట్టే పని పూర్తి చేశారు. మూడో కంటైనర్‌లో చేపలు లోడు చేస్తుండగా, దానిపై ఉన్న పరదా చెరువు మీదుగా వెళ్తున్న విద్యుత్ సర్వీసు వైరుపై పడింది. దీంతో ఉండి మండలం వెలువర్రు గ్రామానికి చెందిన నక్కా వెంకన్న (35) ఆ పరదాను తొలగించడానికి ప్రయత్నించగా, విద్యుత్ సరఫరా అయి అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. తోటి కూలీలు కర్రలతో అతన్ని పక్కకు నెట్టేసరికి అప్పటికే వెంకన్న ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో వెంకన్నను కాపాడబోయిన మరో కూలీ చిక్కాల ఏసుబాబు కూడా విద్యుత్ షాక్‌కు గురై స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులను మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వెంకన్న మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఏసుబాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై క్రాంతికుమార్ తెలిపారు.
10న జాబ్ మేళా
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): స్థానిక రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఈ నెల 10న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్ జితేంద్ర తెలిపారు. ఈ మేళాలో సుమారు 13 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని, 650 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. పదో తరగతి, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ విద్యార్హతలు కలిగి, 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు అర్హులని , వివరాలకు 70953 864433, 96525 03799లో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.


