గణపయ్యకు గ్లోబల్‌ క్రేజ్‌ ! | - | Sakshi
Sakshi News home page

గణపయ్యకు గ్లోబల్‌ క్రేజ్‌ !

Sep 11 2026 11:03 AM | Updated on Sep 11 2026 11:03 AM

గణపయ్యకు గ్లోబల్‌ క్రేజ్‌ !

చవితి ఉత్సవాలకు సిద్ధం

ద్వారకాతిరుమల: విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. విద్య, విజ్ఞానం, విజయాలకు ఆదిదేవుడు.. భారతీయుల ఆరాధ్య దైవమైన గణనాథుడి ఖ్యాతి దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హిందూ సంప్రదాయంలోనే కాకుండా వివిధ దేశాల సంస్కృతులు, కళలు, ఆధ్యాత్మిక సంప్రదాయాల్లోనూ వినాయకుడి రూపాలు కనిపిస్తుండటం విశేషం. భారతదేశంలో వేలాది గణేశ్‌ ఆలయాలు, విగ్రహాలతో పాటు ప్రతి ఏడాది గణేశ్‌ చతుర్థి వేడుకలు వైభవంగా జరుగుతాయి. పొరుగున ఉన్న నేపాల్‌లో కాఠ్మాండుతో పాటు పలు ప్రాంతాల్లో గణేశ్‌ ఆలయాలు ఉన్నాయి. థాయ్‌లాండ్‌లో ‘ఫ్రా ఫికానెట్‌’గా పిలిచే గణేశుడు అదృష్టం, విజయం, కళలకు ప్రతీకగా ఆరాధించబడుతున్నాడు.

పురాతన శిల్పాల్లోనూ..

ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం వంటి దేశాల్లోని పురాతన ఆలయాలు, శిల్పకళలో గణేశుడి రూపాలు దర్శనమిస్తాయి. జావా, బాలి ప్రాంతాల్లోని పురాతన కళా సంపదలో గణేశుడి శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వియత్నాంలోని చామ్‌ కళా సంప్రదాయంలోనూ గణేశుడి శిల్పాలకు చారిత్రక ఆధారాలున్నాయి. జపాన్‌లో ‘కంగిటెన్‌’ రూపంలో గణేశుడి ఆరాధనకు చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి.

ప్రపంచ దేశాల్లోనూ విగ్రహాలు

మలేషియా, సింగపూర్‌, శ్రీలంక, మయన్మార్‌ తదితర ఆసియా దేశాల్లో హిందూ దేవాలయాల్లో గణేశుడి విగ్రహాలు కొలువుదీరాయి. మారిషస్‌లో భారతీయ మూలాలున్న ప్రజలలో గణేశ్‌ ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లోనూ హిందూ ఆలయాలతో పాటు మ్యూజియంలలో గణేశుడి విగ్రహాలు, కళాఖండాలు కనిపిస్తాయి. సీషెల్స్‌ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయకర్‌ ఆలయం అక్కడి గణేశ్‌ ఆరాధనకు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది.

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, పసడీనా నగరంలోని నార్టన్‌ సైమన్‌ మ్యూజియంలో ఉన్న 1164 నాటి గణేష్‌ శిల్పం

విశిష్ట ఖ్యాతి కలిగిన గణనాథుడి నవరాత్రి ఉత్సవాలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రతి ఏటా అట్టహాసంగా నిర్వహిస్తారు. వినాయకచవితి అంటేనే పండుగ సందడి, భక్తి శ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఏ పండుగలోనూ కనిపించని ప్రత్యేక సందడి వినాయకచవితి వేడుకల్లో కనిపిస్తుంది. వీధివీధినా వినాయక విగ్రహాల ప్రతిష్ఠ, మండపాల ఏర్పాటు, ప్రత్యేక అలంకరణలు, భక్తి కార్యక్రమాలతో పండుగ వాతావరణం నెలకొంటుంది. యువత సైతం ఉత్సవాల నిర్వహణలో ముందుండి ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈనెల 14న వినాయకచవితి పండుగను ఘనంగా జరుపుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల వినాయక మండపాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. విగ్రహాల కొనుగోలు, మండపాల అలంకరణ, విద్యుత్‌ దీపాల ఏర్పాటు తదితర పనులు వేగం పుంజుకున్నాయి. మరోవైపు ఉత్సవ కమిటీలు ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నాయి.

భారతీయ ఆధ్యాత్మికతకు విశ్వవ్యాప్త ప్రతీకగా వినాయకుడు

ఆసియా దేశాల నుంచి అమెరికా, యూరప్‌ వరకు గణేషుడి విగ్రహాలు

ఇండోనేషియా కరెన్సీ నోటుపైనా కొలువైన గణేషుడు

ఈనెల 14న వినాయకచవితి సందర్భంగా ప్రత్యేక కథనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement