‘కొమ్మ’ కాసిన ప్రాణం
ఇరగవరం: ఇరగవరం మండలంలోని ఓగిడికి చెందిన మండే గణేష్ అనే విద్యార్థి నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. గణేష్ సోదరుడు ప్రసాద్ వివాహం శనివారం తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో జరు గుతుండగా స్నేహితులను ఆహ్వానించాడు. వీరిలో సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు, ఉయ్యూరువారి మెరక గ్రామాలకు చెందిన చెరుకువాడ రామ్‌చరణ్ అలియాస్ రాజారామ్ (17), పోతుల లక్ష్మీభాను వికాస్ (18), నాగిరెడ్డి దుస్వంత్ సాయి (18), పెనుమంట్ర మండలం సత్యవరానికి చెందిన నాగాబత్తుల సాయిసూర్యతేజ (19), నరసాపురానికి చెందిన మట్టా సంతోష్ (19), పాలకొల్లు మండలం చింతపర్రుకు చెందిన వీరమల్లు వెంకట సాయికిరణ్ (19) కారులో పెరవలి వెళ్లారు. రాత్రి 7.30 గంటలకు వివాహం కాగా.. వీరంతా రాత్రి 11.30 గంటలకు అదే కారులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో ఓగిడి గ్రామంలో పెళ్లి పనుల్లో ఉన్న గణేష్‌ను తమతో రావాలని కోరారు. అయితే అప్పటికే అలసిపోయిన గణేష్‌ను వీరితో పంపేందుకు కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో వీరు ఆరుగురు అదే కారులో ఓగిడి నుంచి అయితంపూడి వైపు వస్తూ ఉండగా అయితంపూడి లాకుల వద్ద వచ్చేసరికి వర్షం ఎక్కువగా రావడంతో దారి సరిగ్గా కనిపించలేదు. దీంతో రోడ్డు పక్కన ఉన్న నరసాపురం కాలువలోకి కారు దూసుకుపోయింది. ఐదుగురు కాలువలో నీటి ప్రవాహానికి గల్లంతు కాగా.. స్థానికుల సాయంతో సంతోష్ బయటకు వచ్చి స్థానికులకు విషయం చెప్పాడు. పోలీసులు హుటాహుటిన ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీసి విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డీఎస్పీలు రవిచంద్ర, విశ్వనాథ్‌ల పర్యవేక్షణలో సీఐలు వెంకటేశ్వరరావు, వెంకటరమణ, ఇరగవరం ఎస్సై నసీరుల్లా తణుకు, తణుకు రూరల్, అత్తిలి ఎస్సైలు వారి సిబ్బంది, ఎస్డీఆర్‌ఎఫ్ బలగాలు, రెవెన్యూ అధికారులు, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. లాకుల సమీపంలో రెండు, పెనుమంట్ర మండలం మార్టేరు లాకుల వద్ద మరో రెండు మృతదేహాలను బయటకు తీశారు. గల్లంతైన ఐదుగురిలో లక్ష్మీభాను వికాస్, దుస్వంత్‌సా యి, సాయిసూర్యతేజ, సాయికిరణ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. రామ్‌చరణ్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతదేహాలను తణుకు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సత్యవరంలో విషాదఛాయలు
పెనుమంట్ర: నాగాబత్తుల సాయి సూర్యతేజ మృతితో సత్యవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని సాకూరుకు చెందిన నాగాబత్తుల లోహిదాసు వ్యవసాయ కూలీ కాగా వీరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. దీంతో వీరి కుమారుడు సాయిసూర్యతేజ చిన్నప్పటి నుంచి సత్యవరంలో మేనమామ గడ్డం జగదీష్ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. సాయి సూర్యతేజ నరసాపురం స్వర్ణాంధ్ర కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. చేతికి అంది వస్తున్న కొడుకు మరణ వార్త తెలియడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబసభ్యులంతా బోరున విలపిస్తున్నారు.
వారంతా ఇంజనీరింగ్ విద్యార్థులు.. స్నేహితుడి ఇంట వివాహ వేడుకకు హాజరయ్యారు.. ఆనందంగా గడిపి కారులో తిరుగు ప్రయాణమయ్యారు.. దారిలో సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ.. సంతోషంగా గడిపిన యువకులు గమ్యం చేరుకునే లోపు మృత్యుఒడిలోకి వెళ్లిపోయారు.. నిశీధి వేళ ‘మృత్యు’ ప్రవాహంలో గల్లంతై అసువులు బాశారు. ఇరగవరం మండలం అయితంపూడి లాకుల వద్ద నరసాపురం కాలువలోకి కారు దూసికెళ్లిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది.
నరసాపురం కాలువలోకి దూసుకెళ్లిన కారు
ఐదుగురు విద్యార్థుల గల్లంతు
నాలుగు మృతదేహాలు లభ్యం
మరో విద్యార్థి కోసం గాలింపు
ప్రాణాలతో బయటపడ్డ ఓ విద్యార్థి
అయితంపూడిలో విషాద ఘటన
ప్రమాదంలో బతికి బట్టకట్టిన సంతోష్‌ను ఓ చెట్టు కొమ్మ కాపాడింది. కారు కాలువలోకి దూసుకువెళ్లిన తర్వాత కారులోంచి బయటకు వచ్చిన ఆరుగురు కారు టాప్‌పైకి చేరుకున్నారు. కారు కాలువలో మునిగిపోతుందని గ్రహించిన వారంతా ఈదుకుంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ గల్లంతయ్యారు. అదే కారు పైభాగంలో నిలుచున్న సంతోష్ కాపాడండంటూ కేకలు వేయడంతో రోడ్డున వెళుతున్న ఓ వ్యక్తి ‘నేను చేయిస్తాను.. నువ్వు దూకి పట్టుకో’ అని చెప్పడంతో సంతోష్ ప్రయత్నం చేశాడు. అయితే అతడి చేయి అందకపోవడంతో నీటిలో కొట్టుకుపోతుండగా ఓ చెట్టు కొమ్మ ఆసరాగా దొరికింది. దానిని పట్టుకుని సంతోష్ వేలాడుతుండగా గట్టుపై ఉన్న వ్యక్తి మరికొందరి సాయంతో తాడు వేసి సంతోష్‌ను రక్షించాడు.


