కూటమి సిఫార్సులు.. ఆగని అక్రమ నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

కూటమి సిఫార్సులు.. ఆగని అక్రమ నిర్మాణాలు

Aug 17 2026 1:05 AM | Updated on Aug 17 2026 1:05 AM

చూసీచూడనట్టు అధికారుల వైఖరి

భీమవరం(ప్రకాశం చౌక్‌): ‘వడ్డించేవాడు మనవాడైతే చివర కూర్చున్నా అన్నీ వస్తాయి’ అన్న సామెత భీమవరం పట్టణంలో అక్రమ భవనాల నిర్మాణాల విషయంలో అక్షరాలా నిజమవుతోంది. స్థానిక టౌన్‌ ప్లానింగ్‌ విభాగాన్ని తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులు తమ గుప్పిట్లో ఉంచుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవన నిర్మాణాలు చేపట్టేవారు అధికారులను కలవాల్సిన పనిలేకుండా, నేరుగా కూటమి నాయకులను కలిసి ఒప్పందాలు చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అవినీతి ‘ప్లాన్లు’.. రూల్స్‌కు తిలోదకాలు

ప్రభుత్వానికి చెల్లించాల్సిన మున్సిపల్‌ ఫీజులు, టౌన్‌ ప్లానింగ్‌ అనుమతులతో పనిలేకుండా నాయకులకు నజరానాలు చెల్లిస్తే చాలు.. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు సాగిపోతున్నాయి. ఎలాంటి ప్లాన్‌ లేకుండానే నాలుగు, ఐదు అంతస్తుల భవనాలను నిర్మించి వాణిజ్య సంస్థలకు అద్దెలకు ఇస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడుతూ, నాయకుల జేబులు నిండుతున్నాయి.

పరిధుల వారీగా పంపకాలు

వన్‌టౌన్‌, టూటౌన్‌ పరిధిలోని ప్రధాన ప్రాంతాలను ముగ్గురు భాగస్వామ్య పక్షాల నాయకులు పంచుకున్నట్లు సమాచారం. గడిచిన రెండేళ్లలో దాదాపు 10 నుంచి 15 వరకు అక్రమ భవనాలు, అదనపు అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. టూటౌన్‌లో నూతనంగా వెలిసిన ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు, అలాగే వన్‌టౌన్‌లో మున్సిపల్‌ కార్యాలయ సమీపంలోని నిర్మాణాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. నిబంధనల ప్రకారం రోడ్డు మార్గానికి వదలాల్సిన సెట్‌ బ్యాక్‌ ఖాళీ స్థలాన్ని సైతం వదలకుండా నిర్మిస్తుండటంతో, వాహనాల పార్కింగ్‌ రోడ్లపైనే జరిగి తీవ్ర ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి.

అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు చర్యలకు సిద్ధమయ్యే అధికారులకు కూటమి ప్రజాప్రతినిధుల హెచ్చరికలు, సిఫార్సులు అడ్డుగా మారుతున్నాయి. దీంతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కేవలం నోటీసుల జారీకే పరిమితమవుతున్నారు. మున్సిపల్‌ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఉద్దేశించి ‘మీకు వసూళ్లు ఎక్కువయ్యాయి, సీబీఐకి పట్టిస్తా’ అని హెచ్చరించారు. అలాగే ఎంపీ శ్రీనివాసవర్మ కూడా బీజేపీకి చెందిన ఓ నాయకుడి భవనం విషయంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను హెచ్చరించడం గమనార్హం. ప్రజాప్రతినిధులే ఇలా ఉంటే అధికారులు ఎలా పనిచేస్తారని, ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ అంతస్తులకు అడ్డే లేదు

నేతల చేతుల్లో ‘టౌన్‌ ప్లానింగ్‌’

వీరు చెబితే చాలు బిల్డింగ్‌ ప్లాన్‌ అక్కర్లేదు!

ప్రతి భవనం వెనుకా ఒక్కో నేత

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు

నోటీసులకు పరిమితమవుతున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement