పెనుగొండ: గ్రామంలోని ఓ మద్యం దుకాణం వద్ద శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో సుమారు 45 నుంచి 50 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అధికంగా మద్యం సేవించడం వల్ల మృతి చెందాడా? లేక ఇతర కారణాలు ఉన్నాయా?అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నీలం రంగు పొడుగు చేతుల చొక్కా, పచ్చ రంగు పువ్వుల లుంగీ ధరించి ఉన్నాడు. ప్రాథమిక విచారణలో అతను పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవించే వ్యక్తిగా గుర్తించినట్లు ఎస్సై కె.గంగాధర్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని వివరించారు.
నరసాపురం రూరల్: సత్యం చారిటబుల్ ట్రస్ట్‌లో రూ. 10 వేలు పెట్టుబడి పెడితే స్వల్పకాలంలోనే రూ. లక్ష ఇస్తామని నమ్మబలికి సుమారు 48 మందిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని యర్రంశెట్టివారిపాలెం గ్రామానికి చెందిన కూనపరెడ్డి రామచంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నరసాపురం, మొగల్తూరు మండలాలకు చెందిన రామచంద్రరావుతో పాటు మరో 47 మంది నుంచి ఇలాగే డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు గుర్తించారు. ఎల్బీచర్ల గ్రామానికి చెందిన చిగురుపాటి వెంకట్రాజు ఈ మోసానికి పాల్పడినట్లు ఎస్సై వాసు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


