నూజివీడు: మతిస్థిమితం లేక ఇల్లు దాటి వెళ్ళిన తొమ్మిదేళ్ల బాలుడిని పోలీసులు సురక్షితంగా తల్లి చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని ఢమ్‌ఢమ్ గార్డెన్ ప్రాంతానికి చెందిన షేక్ ఫాతిమా కొడుకు షేక్ అబ్దుల్ సలీమ్ (9) మతిస్థిమితం లేక అజరయ్యపేట నుంచి రేగుంట వైపు వెళ్లాడు. గమనించిన రేగుంట గ్రామస్తులు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రూరల్ ఎస్సై జ్యోతీబసు సిబ్బందిని పంపి బాలుడిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. చిన్నారి తమ తల్లిదండ్రుల వివరాలు చెప్పలేకపోవడంతో పోలీసులు ఆ సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. విషయం తెలుసుకున్న తల్లి ఫాతిమా సీఐ కార్యాలయానికి చేరుకోగా, సీఐ ఐవీ నాగేంద్రకుమార్, ఎస్సై జ్యోతీబసులు బాలుడిని ఆమెకు అప్పగించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్‌ఎన్‌ఎల్ ఏలూరు పరిధిలోని వినియోగదారులకు పలు ప్రత్యేక ఆఫర్లు, రాయితీలు అందిస్తున్నట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ సీవీ రామరాజు తెలిపారు. శుక్రవారం స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆఫర్ల వివరాలను ప్రకటించారు. ఈ ప్రత్యేక ఆఫర్లు సెప్టెంబర్ 12 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కొత్త ఫైబర్ కనెక్షన్లకు ఏర్పాటు రుసుము లేకుండా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
భీమవరం: పార్సిళ్లు పంపేందుకు పోస్టల్ శాఖ ప్రత్యేక సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు డివిజినల్ సీనియర్ సూపరింటెండెంట్ కె.హరికృష్ణప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమీపంలోని పోస్టాఫీసుల ద్వారా విదేశాల్లోని బంధువులు, స్నేహితులకు విభిన్న వస్తువులను పంపుకోవచ్చని పేర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్ మెయిల్ సర్వీస్ ద్వారా డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ ద్వారా తక్కువ బరువున్న బహుమతులు పంపవచ్చని వివరించారు. అలాగే ఎక్కువ బరువున్న పార్సిళ్లను ఎయిర్ పార్సిల్ సర్వీస్ ద్వారా పంపుకునే సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.


